Let's talk: editor@tmv.in
ఇజ్రాయెల్ చర్చల ప్రతిపాదన.. అమెరికాకు లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్!
ఇజ్రాయెల్ చర్చల ప్రతిపాదన.. అమెరికాకు లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్!

ఇజ్రాయెల్ చర్చల ప్రతిపాదన.. అమెరికాకు లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్!

Shaik Mohammad Shaffee
11 ఏప్రిల్, 2026

పశ్చిమాసియాలో గత కొంతకాలంగా సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికే దిశగా కీలక దౌత్య అడుగులు పడుతున్నాయి. ఇజ్రాయెల్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు లెబనాన్ సిద్ధమైంది. ఈ చారిత్రక చర్చల కోసం లెబనాన్ ప్రధానమంత్రి నవాఫ్ సలామ్ మరో రెండు రోజుల్లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసికి పయనం కానున్నట్లు సీఎన్ఎన్ నివేదించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రతిపాదనకు లెబనాన్ సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రతిపాదన నెతన్యాహుది.. పయనం సలామ్‌ది

లెబనాన్ ప్రభుత్వం నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, ఆ దేశంతో నేరుగా చర్చలు జరపాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించినట్లు శుక్రవారం నెతన్యాహు ప్రకటించారు. ముఖ్యంగా హిజ్బుల్లాను నిరాయుధులను చేయడం, ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. "బీరుట్‌ను సైనిక రహితంగా మార్చాలని లెబనాన్ ప్రధాని చేసిన పిలుపును మేము అభినందిస్తున్నాం. అందుకే చర్చలకు మొగ్గు చూపాం" అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఒకవైపు చర్చలు.. మరోవైపు బాంబుల వర్షం

రాజకీయంగా చర్చల మాట వినిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం భీకర పోరు కొనసాగుతోంది. లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) విరుచుకుపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జరిగిన భారీ దాడుల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ అధికారులు ధ్రువీకరించారు. "లెబనాన్‌లో కాల్పుల విరమణ అన్న ప్రసక్తే లేదు. హిజ్బుల్లాను సమూలంగా తుడిచిపెట్టే వరకు మా సైన్యం పూర్తి శక్తితో దాడులు కొనసాగిస్తుంది" అని నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం.

ప్రశ్నార్థకంగా అమెరికా-ఇరాన్ ఒప్పందం

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. ఈ ఒప్పందం లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని ఇరాన్ వాదిస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ అంశం తమ అంతర్గత భద్రతకు సంబంధించిందని, దీనికి ఆ ఒప్పందంతో సంబంధం లేదని తేల్చిచెబుతోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌లో జరగబోయే చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.