Let's talk: editor@tmv.in
ఇజ్రాయెల్ ఎవ్వ‌రికీ తలొగ్గ‌దు

ఇజ్రాయెల్ ఎవ్వ‌రికీ తలొగ్గ‌దు

Venkatesh Balusula
28 సెప్టెంబర్, 2025

ప‌శ్చిమ దేశాలు అంత‌ర్జాతీయ ఒత్తిళ్ల‌తో పాల‌స్తీనాకు గుర్తింపు ఇస్తున్నాయ‌ని, ఇజ్రాయెల్ మాత్రం ఎవ్వ‌రి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌ద‌ని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు స్ప‌ష్టం చేశారు. ఐక్య రాజ్య స‌మితి సాధార‌ణ స‌భ‌లో నెత‌న్యాహు కీల‌క ప్ర‌సంగం చేశారు. ఈ మేర‌కు పాలస్తీనా రాష్ట్రాన్ని అంగీకరిస్తున్న పాశ్చాత్య దేశాలపై తీవ్ర‌ విమర్శ‌లు చేశారు. ఆయా దేశాలు యూదులను చంపడం లాభదాయకమన్న‌ సందేశాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. గత రెండేళ్లుగా గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు పాలస్తీనా రాష్ట్రాన్ని అంగీకరిస్తున్నాయని ఆయన అన్నారు. ఇటీవ‌ల‌ ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు పాలస్తీనా రాష్ట్రాన్ని అంగీకరించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు నెత‌న్యాహు ప్ర‌సంగంపై స‌భ‌లో భిన్న వాద‌నలు వినిపించాయి. కొంద‌రు ప్ర‌సంగానికి ముందే స‌భ నుంచి వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌సంగంపై భిన్న స్పంద‌న‌లు

అక్టోబర్ 7, 2023న హమాస్ దాడుల తర్వాత కూడా ప‌శ్చిమ దేశాలు పాల‌స్తీనాకు గుర్తింపు ఇవ్వ‌డం సిగ్గుచేటన్నారు. హ‌మాస్‌ దాడులను 90 శాతం పాలస్తీనీయులు సమర్థించారని చెప్పారు. ఇజ్రాయెల్ ఎప్ప‌టికీ పాలస్తీనా గుర్తింపును అంగీకరించదని స్పష్టం చేశారు. హమాస్ దాడుల్లో 1,200 మంది మరణించారని వెల్ల‌డించారు. ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో గాజాలో 65,000 మంది మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. గాజా ప్రాంతం చాలా మేర‌కు శిథిలమైంది. నెతన్యాహు ప్రసంగం మొదలవుతుండగా చాలా మంది ప్ర‌తినిధులు వాకౌట్ చేశారు. మ‌రికొంద‌రు దీనికి భిన్నంగా బాల్కనీలో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సమీపంలో పాలస్తీనా అనుకూలవాదులు ఆందోళ‌న చేప‌ట్టారు. నెత‌న్యాహు చాలా దేశాలు మీడియా, ఇస్లామిక్ గ్రూపులు, యూదు వ్యతిరేకుల ఒత్తిడికి లొంగిపోయాయని ఆరోపించారు. కష్టకాలంలో ధైర్యంగా ముందుకు రావాలి కానీ మీరు లొంగిపోయారని విమర్శించారు. రహస్యంగా చాలా దేశాలు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సేవలను ప్రశంసిస్తున్నాయని చెప్పారు. హమాస్ నియంత్రణలోని గాజా మీడియా కార్యాలయం నెతన్యాహు ప్రసంగాన్ని ఖండించింది. అది పూర్తిగా అబ‌ద్ధాల ప్ర‌సంగం అని పేర్కొంది. నెత‌న్యాహు యుద్ధ నేరాల‌ను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆరోపించింది.

ట్రంప్‌, నెత‌న్యాహు భేటీకి ఏర్పాట్లు

గాజా ముట్టడి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌ను నియంత్రించకపోవడంపై న్యూయార్క్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తమైంది. అరబ్ ముస్లిం నాయకులు గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఖండించారు. ఐర్లాండ్ ప్రధాని మైకెల్ మార్టిన్ ఇజ్రాయెల్ చర్యలను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ‌ క్రిమినల్ కోర్టు నెతన్యాహుపై యుద్ధ నేరాల‌ వారంట్ జారీ అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నెత‌న్యాహు నాటో దేశాల గ‌గ‌నత‌లంలో నుంచి కాకుండా వేరే మార్గంలో ప్ర‌యాణించి న్యూయార్క్ చేరుకున్నారు. కొన్ని దేశాలు హమాస్ మిగిలిన బందీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంద‌ని, యుద్ధం ముగించి గాజా నుంచి ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాలని సూచించాయి. 48 మంది బందీల్లో 20 మంది మాత్రమే బతికి ఉన్నార‌ని, అక్టోబర్ 7ను ప్రపంచం మరచిపోయింది కానీ మేం మ‌ర్చిపోలేద‌ని నెతన్యాహు అన్నారు. ట్రంప్ చ‌ర్చ‌లు జ‌రిపి యుద్ధం ముగించే అవ‌కాశం ఉంద‌ని గాజాలో ప్ర‌చారం న‌డుస్తోంది. సోమ‌వారం వాషింగ్ట‌న్‌లో నెతన్యాహు, ట్రంప్ భేటీ కానున్నారు. నెతన్యాహుపై బందీల కుటుంబాలు, ఇజ్రాయెల్ ప్రజలు ఒత్తిడి పెంచుతున్నారు. ఆయ‌న మాత్రం హమాస్ పూర్తిగా నాశనం అయ్యేవరకు యుద్ధం కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు.

ఐరాస వేదిక‌గా ఎన్నో దేశాలు నెత‌న్యాహు తీరును వ్య‌తిరేకించినా అమెరికా మాత్రం పూర్తి మ‌ద్ద‌తు తెలిపింది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ గాజాలో ఇజ్రాయెల్ చర్యలను సామూహిక వ‌ధ‌గా అభివ‌ర్ణించారు. పాలస్తీనా రాష్ట్రాన్ని అంగీకరించిన దేశాలకు ధన్యవాదాలు చెప్పారు. పాలస్తీనా అథారిటీ గాజా పాలనకు సిద్ధమని, హమాస్‌ను నిరాయుధం చేయాలని పేర్కొన్నారు. ట్రంప్ పై నెత‌న్యాహు ప్ర‌శంస‌లు కురిపించారు. ట్రంప్ యూదు వ్యతిరేకతపై చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. పాలస్తీనా అనుకూల నిరసనల నుంచి యూదు విద్యార్థులను రక్షించకపోతే యూనివర్సిటీలకు నిధులు నిలిపివేశార‌న్నారు. పాల‌స్తీనాకు గుర్తింపునిచ్చే దేశాల సంఖ్య పెరుగుతున్నా నెత‌న్యాహు వ్య‌తిరేకించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అంత‌ర్జాతీయ వేదిక‌పై గుర్తింపునిస్తున్న దేశాల‌ను విమ‌ర్శించ‌డం, హెచ్చ‌రించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది.ఇంత వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నా ఇజ్రాయెల్ వెన‌క్కి త‌గ్గేది లేదంటూ గాజాపై త‌మ యుద్ధం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. శాంతి కోసం అన్ని పక్షాలు మాట్లాడాల్సిన అవ‌స‌ర‌ముంది. లేని ప‌క్షంలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని మరింత పొడిగించవచ్చు. ఫ‌లితంగా గాజా ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారిపోయే ప్ర‌మాదం ఉంది.

ఇజ్రాయెల్ ఎవ్వ‌రికీ తలొగ్గ‌దు - Tholi Paluku