
ఇజ్రాయెల్ అణుకేంద్రమే లక్ష్యంగా ఇరాన్ ఎటాక్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నాలుగో వారంలోకి అడుగుపెట్టిన వేళ కొత్త మలుపు తిరిగింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో అణు పరిశోధనా కేంద్రానికి సమీప ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల్లో హోర్ముజ్ జలసంధిని తెరవాలని అల్టిమేటం జారీ చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో డిమోనా, అరాద్ పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పది అపార్ట్‌మెంట్ భవనాలు దెబ్బతినగా, కనీసం 60 మందికి పైగా గాయపడ్డారు. అణు కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాలపై దాడులు జరగడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. ముఖ్యంగా, ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణులను అడ్డుకోలేకపోవడం యుద్ధంలో కీలక మార్పుగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఈ ఘటనను ‘చాలా కఠినమైన సాయంత్రం’గా అభివర్ణిస్తూ, అత్యవసర సిబ్బందిని సంఘటనా స్థలానికి తరలించినట్లు తెలిపారు. ఈ దాడులు జరగడానికి కొద్ది గంటల ముందు, ఇరాన్‌లోని ప్రధాన అణు సౌకర్యమైన నతాంజ్ కేంద్రంపై దాడి జరిగింది. అనంతరం ఇరాన్ ప్రతీకారంగా ఈ క్షిపణి దాడులు చేపట్టింది.
సవాళ్లు.. ప్రతి సవాళ్లు
ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి మూసుకుపోవడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌కు గడువు విధిస్తూ, జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్‌లోని ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలకు ప్రతిగా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. తమ ఎనర్జీ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే, అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన కీలక సదుపాయాలపై ప్రతీకార దాడులు తప్పవని స్పష్టం చేసింది. యుద్ధం మరింత విస్తరిస్తున్న సంకేతాల మధ్య, ఇరాన్ ఇండియన్ ఓషన్‌లోని అమెరికా-బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డియాగో గార్షియాపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. అలాగే లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ యుద్ధంలో ఇరాన్‌లో 1500 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో 15 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా డ్రోన్ దాడులు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. చమురు సరఫరా దెబ్బతినడంతో ధరలు భారీగా పెరుగుతుండగా, ఇంధన, ఆహార రంగాలపై ఒత్తిడి పెరుగుతోంది. మొత్తంగా, అణు కేంద్రాల సమీపంలో దాడులు, హోర్ముజ్ సంక్షోభం, అమెరికా-ఇరాన్ పరస్పర హెచ్చరికలతో ఈ యుద్ధం మరింత ప్రమాదకర దిశగా సాగుతోంది.
హోర్ముజ్ తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు ధ్వంసం... ట్రంప్
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నాలుగో వారంలో మరింత ఉద్రిక్తంగా మారింది. హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ‘పూర్తిగా ధ్వంసం చేస్తాం’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిగా, తమ ఎనర్జీ సదుపాయాలపై దాడులు జరిగితే అమెరికా, ఇజ్రాయెల్ మౌలిక వసతులపై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో గ్లోబల్ చమురు ధరలు పెరిగి, అనేక దేశాలపై ప్రభావం పడుతోంది. ఈ ఒత్తిడి మధ్య ట్రంప్ ఈ అల్టిమేటం జారీ చేశారు.
ఖతార్ హెలికాప్టర్ ప్రమాదం
పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఖతార్ తీరానికి సమీపంలో హెలికాప్టర్ కూలి 6 మంది మరణించినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని రక్షణ శాఖ వెల్లడించింది. ఇంకా ఒకరు గల్లంతయ్యారు.
పోటాపోటీగా దాడులు
ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని ఆండిమెష్క్ నగరంలోని ఇమామ్ అలీ ఆసుపత్రిపై వైమానిక దాడి జరగడంతో, అక్కడి రోగులను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆసుపత్రి భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇతమార్ బెన్ గ్విర్ అరాద్ ప్రాంతాన్ని సందర్శిస్తూ ‘ఇది ఇరాన్‌పై చారిత్రాత్మక యుద్ధం’ అని వ్యాఖ్యానించారు. గెలిచే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
సౌదీ, యూఏఈలో హెచ్చరికలు
సౌదీ అరేబియా రాజధాని రియాద్ వైపు దూసుకొచ్చిన మూడు క్షిపణుల్లో ఒకదాన్ని గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. మరో రెండు నిర్జన ప్రాంతాల్లో పడ్డాయి. ఆరు డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరానికి సమీపంలో ఓ వాణిజ్య నౌక పక్కన పేలుడు సంభవించింది. నౌక సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు బ్రిటన్ నౌకా భద్రతా కేంద్రం తెలిపింది.
శ్రీలంకలో ఇంధన ధరల పెంపు
మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరగడంతో శ్రీలంకలో ఇంధన ధరలను సుమారు 25 శాతం పెంచారు. దేశంలో ఇంధన కొరత ఏర్పడటంతో రేషన్ విధానం అమలు చేస్తున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను వారానికి ఒక రోజు మూసివేస్తున్నారు.
హోర్ముజ్ వద్ద బ్రిటన్ అణు సబ్‌మరైన్ మోహరింపు
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, బ్రిటన్‌కు చెందిన అణుశక్తి సబ్‌మరైన్ హెచ్‌ఎంఎస్ అన్సన్ అరేబియా సముద్రంలో కీలక స్థావరాన్ని చేరినట్లు సమాచారం. అల్‌జజీరా, డెయిలీ మెయిల్ నివేదికలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 6న పెర్త్ నగరం నుంచి బయలుదేరిన ఈ సబ్‌మరైన్, హర్ముజ్ జలసంధి సమీపంలోని ఉత్తర అరేబియా సముద్రంలో వ్యూహాత్మక స్థానం దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సబ్‌మరైన్‌లో 1,600 కిలోమీటర్ల పరిధి గల టోమాహాక్ బ్లాక్-4 క్షిపణులు, స్పియర్‌ఫిష్ టార్పెడోలు అమర్చబడి ఉండటంతో దాడి సామర్థ్యం గణనీయంగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
ఇంగ్లాండ్‌లో కూడా కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా సైన్యానికి తమ సైనిక స్థావరాల వినియోగాన్ని విస్తరించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సీఎన్‌ఎన్ వెల్లడించింది. ఈ స్థావరాలు హోర్ముజ్ సముద్రసంధిలో నౌకలపై దాడులకు సంబంధించి ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులకు ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు బ్రిటన్, తమ ప్రాణాలు లేదా ప్రయోజనాలకు నేరుగా ముప్పు ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుమతిని పరిమితం చేసేది. అయితే ఇప్పుడు ‘రక్షణాత్మక చర్యల’ పేరిట ఈ పరిధిని విస్తరించడం గమనార్హం. అయితే, ఈ నిర్ణయంపై దేశీయ రాజకీయాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకురాలు కెమీ బాడెనోచ్ దీనిని అత్యంత పెద్ద యూటర్న్ గా విమర్శించారు.
ఇక ఇరాన్ కూడా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ, బ్రిటన్ ఈ చర్యలను ఆక్రమణలో భాగస్వామ్యంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇది పరిమితమైన రక్షణాత్మక చర్య మాత్రమేనని బ్రిటన్ స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ మొదట ఈ అభ్యర్థనను తిరస్కరించినప్పటికీ, మధ్యప్రాచ్యంలో బ్రిటిష్ సైనిక స్థావరాలపై దాడులు జరిగిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
లెబనాన్‌లో హమాస్ కీలక నేత హతం: ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన
లెబనాన్‌లో హమాస్‌కు చెందిన కీలక ఆర్థిక నెట్‌వర్క్ నేత వాలిద్ మహ్మద్ డిబ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన ప్రకటనలో, డిబ్ హమాస్ కేంద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ, జూడియా-సమారియా, లెబనాన్ తదితర ప్రాంతాలకు నిధుల తరలింపును సమన్వయం చేసినట్లు తెలిపింది. అలాగే సిరియా, లెబనాన్ ప్రాంతాల నుంచి ఉగ్రవాద కార్యకర్తల నియామకంలో కూడా అతను ప్రధాన పాత్ర వహించాడని పేర్కొంది.
ఇదిలా ఉండగా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అల్ జజీరా నివేదిక ప్రకారం, శుక్రవారం జరిగిన దాడుల్లో కనీసం 20 మంది మరణించగా, 57 మంది గాయపడ్డారు. మార్చి 2 నుంచి ఇప్పటివరకు జరిగిన దాడుల్లో మొత్తం మృతుల సంఖ్య 1,021కి చేరగా, 2,641 మంది గాయపడ్డారు. ఈ దాడుల కారణంగా 1.34 లక్షల మందికి పైగా ప్రజలు గృహాలను విడిచి ఉపశమన కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు, హెజ్బొల్లా కూడా ప్రతిదాడులకు దిగింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని మారౌన్ అల్-రాస్ ప్రాంతం సమీపంలో డ్రోన్ దాడులు జరిపినట్లు ప్రకటించింది. అదేవిధంగా నహరియా నగరంపై క్షిపణి దాడులు కూడా నిర్వహించినట్లు తెలిపింది.
