
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం: భారత్ నుండి పలు అంతర్జాతీయ విమానాలు రద్దు
అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమానయానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య గగనతలంలో ఆంక్షలు విధించడంతో భారత్ నుంచి భారత్‌కు వచ్చే పలు అంతర్జాతీయ విమానాలు రద్దు కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో శనివారం కలకత్తా, బెంగుళూరు నగరాల్లో మొత్తం 13 విమానాలు రద్దయ్యాయి. ఈ అకస్మాత్తు నిర్ణయాలతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
కలకత్తా విమానాశ్రయంలో నాలుగు అంతర్జాతీయ బయలుదేరే విమానాలు ముందస్తు సమాచారం లేకుండానే రద్దయ్యాయి. దుబాయ్‌కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ EK 573, దోహాకు వెళ్లే ఖతార్ ఎయిర్‌వేస్ QR 541, అబుదాబికి వెళ్లే ఎయిర్ అరేబియా 3L 167, అలాగే ఎతిహాద్ ఎయిర్‌వేస్ EY 221 సేవలు నిలిపివేయబడ్డాయి. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాతే రద్దు విషయం తెలియడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కొందరు ప్రయాణికులు ఇప్పటికే చెక్-ఇన్ ప్రక్రియ పూర్తిచేసుకుని, భద్రతా తనిఖీల కోసం వేచి ఉండగా ఈ సమాచారం రావడంతో ఆందోళన మరింత పెరిగింది. విదేశీ పౌరులు కూడా ప్రభావితులలో ఉండటం గమనార్హం.
అలాగే, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ కారణంగా లక్నో నుంచి బయలుదేరాల్సిన పలు అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఈ రద్దుల వల్ల ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, సలామ్ ఎయిర్ సంస్థలు నిర్వహించే విమానాలు ప్రభావితమయ్యాయి.
ఇదే సమయంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అబుదాబి, దమ్మామ్, రియాద్, జెడ్డా, దుబాయ్, దోహా నుంచి రావాల్సిన తొమ్మిది విమానాలు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎమిరేట్స్ సంస్థలకు చెందిన ఈ విమానాలు రద్దుకావడంతో ప్రయాణికుల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వలస కార్మికులు, వ్యాపార ప్రయాణికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి మాట్లాడుతూ, ఇరాన్-అమెరికా ఘర్షణ కారణంగా విధించిన గగనతల పరిమితులే ఈ రద్దులకు ప్రధాన కారణమని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా మధ్యప్రాచ్య ప్రాంతంలో పలు ఎయిర్‌స్పేస్‌లను మూసివేయడం వల్ల విమాన మార్గాలను మార్చడం సాధ్యపడలేదని ఆయన వివరించారు.
కలకత్తా విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న ప్రయాణికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎమిరేట్స్ విమానానికి టికెట్ తీసుకున్న ఓ స్థానికుడు మాట్లాడుతూ, “రద్దు గురించి ముందుగా ఎలాంటి మెసేజ్ రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే విషయం తెలిసింది. సిస్టమ్‌లో మాత్రం ఇంకా ఆలస్యం అని చూపిస్తోంది. స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో మేమంతా అయోమయంలో ఉన్నాం,” అని వాపోయాడు.
నాడియా జిల్లా చెందిన మోతీ సర్దార్ అనే ప్రయాణికుడు దుబాయ్ మార్గంగా ఇజ్రాయెల్‌కు వెళ్లాల్సి ఉంది. “వీసా గడువు దగ్గర పడుతోంది. ఇప్పుడు వెళ్లలేకపోతే నా భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏదైనా పరిష్కారం చూపాలి,” అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
మరో ప్రయాణికుడు కెవిన్ స్కాట్ మాట్లాడుతూ, ఎయిర్‌లైన్ సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. “వెబ్‌సైట్ కూడా పనిచేయడం లేదు. ట్రావెల్ ఏజెంట్‌కూ సమాచారం అందడం లేదు. అవసరమైతే విమానాన్ని గ్రీస్‌కు మళ్లించవచ్చని మాత్రమే చెబుతున్నారు,” అని తెలిపారు.
మొత్తంగా, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు సాధారణ ప్రయాణికుల జీవితాలపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. పరిస్థితులు సద్దుమణిగే వరకు మరిన్ని విమాన రద్దులు లేదా మార్పులు జరిగే అవకాశం ఉందని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు.
