
ఇజ్రాయెల్కు గూఢచర్యం.. ఇరాన్ వ్యక్తికి ఉరి!
ఇజ్రాయెల్కు గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో ఇరాన్ దేశంలోని ఓ వ్యక్తికి ఉరి శిక్ష వేశారు. ఈ విషయాన్ని ఇరాన్ న్యాయస్థానం స్వయంగా వెల్లడించింది. బాబాక్ షాబాజీ అనే వ్యక్తి ఇరాన్ డేటా సెంటర్లు, భద్రతా సంస్థల గురించి సున్నితమైన సమాచారాన్ని సేకరించి ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు అమ్మాడని ఆరోపించింది. దేశ ద్రోహానికి పాల్పడ్డందుకు బుధవారం బాబాక్ షాబాజీని ఉరి తీశామని చెప్పింది. మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానం వాదనను ఖండిస్తున్నారు. అతడిని చిత్రహింసలు పెట్టి, చేయని తనప్పులు ఒప్పుకోవాలని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తున్నారు.
మానవ హక్కుల బృందం ముందస్తు హెచ్చరిక
షాబాజీని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీకి లేఖ రాసినందుకు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆ లేఖలో షాబాజీని ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తానని రాసినట్లు తెలుస్తోంది. ఇరాన్ రష్యాకు డ్రోన్లు సరఫరా చేస్తోంది. మాస్కో ఉక్రెయిన్పై దాడులకు వాటిని ఉపయోగిస్తోంది. ఇరాన్ మానవ హక్కుల బృందం షాబాజీని ఉరితీయవచ్చని ముందే హెచ్చరించింది. జెలెన్స్కీకి బాబాక్ రాసిన సందేశాన్ని ఇజ్రాయెల్కు గూఢచర్యంగా పేర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉపయోగించడం ఇజ్రాయెల్ నేర్పిందని ఆరోపిస్తున్నారని మానవ హక్కుల బృందం తెలిపింది. కానీ, ఇరాన్ ఈ ఆరోపణలను అంగీకరించడం లేదు. షాబాజీ ఉక్రెయిన్ కోసం పోరాడాలనుకున్నాడని వివరించారు.
గూఢచర్యం ఆరోపణలతో ఎనిమిది మందికి ఉరి
ఇరాన్ 12 రోజుల యుద్ధం తర్వాత ఎనిమిది మందిని గూడఛర్యం ఆరోపణలతో ఉరితీసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వైమానిక దాడులు జరిగాయి. ఇందులో 1100 మంది మరణించారు. చాలామంది మిలిటరీ కమాండర్లు చనిపోయారు. ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్పై మిస్సైళ్లు ప్రయోగించింది. ఇరాన్ 2024లో చాలా ఎక్కువ మందిని ఉరితీసింది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఐక్య రాజ్య సమితి రిపోర్టు ప్రకారం సుమారు 975 మందిని ఉరి తీశారు. ఇందులో గూఢచర్యం ఆరోపణలతో కొందరిని చంపేశారు. దీంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. కొందరిని హింసించి, భావ వ్యక్తీకరణను అడ్డుకొని, ఇష్టానుసారం అరెస్టులు కూడా చేశారు.
ఇరాన్లో గూఢచర్యం ఆరోపణలో స్థానికుల్ని ఉరి తీయడం తరచూ జరుగుతూనే ఉంది. బాబాక్ షాబాజీని కూడా ఈ ఆరోపణలతోనే ఉరి తీశారు. బాబాక్ ఇండస్ట్రియల్ కూలింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడంతో పాటు, మిలిటరీ సెక్యూరిటీ కంపెనీలకు పని చేశాడు. బాబాక్ దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇజ్రాయెల్కు పంపించాడని స్థానిక మీడియాలో సైతం కథనాలు ప్రచురితమయ్యాయి. దీనికి ప్రతిఫలంగా బాబాక్కు భారీ ఎత్తున నగదు అందినట్లు పేర్కొన్నాయి. కానీ, మానవ హక్కుల బృందాలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. ఆధారాలు లేకుండానే దేశంలో అరెస్టులు, ఉరి తీయడం ఎక్కువయ్యాయని విమర్శిస్తున్నాయి. సాధారణ పౌరుడు సున్నితమైన సమాచారం ఎలా సేకరిస్తాడని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడికి సహాయం అందిస్తానని లేఖ రాసినందుకే అరెస్ట్ చేసి ఉరి తీసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమాయక నిరసనకారులను లక్ష్యంగా చేసుకొని చంపేస్తున్నారు. అరెస్టులు, ఉరి తీయడం ప్రభుత్వ ప్రతీకార చర్యలుగా కనిపిస్తున్నాయి. దేశ రక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. కానీ, ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో ఇంత పెద్ద చర్యలకు పాల్పడటం విమర్శలకు దారి తీస్తుంది.
