Let's talk: editor@tmv.in
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

Dantu Vijaya Lakshmi Prasanna
25 డిసెంబర్, 2025

జనసేన అధినేతగా ఇచ్చిన మాటను , ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామస్తులు పవన్‌కు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా పవన్, గ్రామంలో వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లారు. పవన్‌కు వృద్ధురాలు, ఆమె కుటుంబం ఆప్యాయంగా స్వాగతం పలికారు. నాగేశ్వరమ్మను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. గత వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పవన్ కల్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఆ సమయంలో వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ ఎన్నికల్లో గెలిచాక మళ్లీ మా గ్రామానికి రావాలంటూ కోరగా.. తప్పకుండా వస్తానని పవన్ హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం.. పవన్ తాజాగా ఇప్పటం గ్రామంలో పర్యటించారు. నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు.

పవన్‌ను చూసిన వెంటనే నాగేశ్వరమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. నువ్వు సీఎం కావాలి.. అది నేను చూడాలి అంటూ ఆశీర్వదించారు. దీనికి ప్రతిస్పందనగా పవన్ కల్యాణ్ ఆమెకు పాదాభివందనంచేసి.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నాగేశ్వరమ్మ యోగక్షేమాలు తెలుసుకున్న పవన్.. ఆమెకు బట్టలు పెట్టారు. రూ. 50వేల నగదు అందించారు. నెలనెలా 5వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆమె మనవడి చదువు కోసం రూ.లక్ష అందించిన పవన్, నాగేశ్వరమ్మ మూడో కొడుకు ట్రీట్మెంట్ కోసం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.3లక్షలను ఇచ్చారు. అప్పట్లో కాలినడకన వెళ్ళి గ్రామస్తులను పలకరించిన పవన్ ఇప్పుడు ఉపముఖ్య మంత్రిగా వెళ్లడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

కాగా పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి నిరసనకు సిద్ధమైన జగన్ సేన, జనసేన నేతలు, కార్యకర్తలు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా తమ గ్రామానికి, తమకి చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు.