Let's talk: editor@tmv.in
ఇంధన సరఫరాలో కేంద్రం విఫలం.. కర్ణాటకలో జీవనోపాధి సంక్షోభం: కాంగ్రెస్‌

ఇంధన సరఫరాలో కేంద్రం విఫలం.. కర్ణాటకలో జీవనోపాధి సంక్షోభం: కాంగ్రెస్‌

Pinjari Chand
8 ఏప్రిల్, 2026

ఎల్పీజీ, ఇంధన సరఫరా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమవడంతో కర్ణాటకలో తీవ్రంగా జీవనోపాధి సంక్షోభం నెలకొన్నదని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనివల్ల ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, గిగ్‌ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌‌, కాంగ్రెస్‌ కర్ణాటక ఇన్‌చార్జి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఐదు లక్షలకుపైగా ఆటో డ్రైవర్లు, లక్షలాది చిన్న హోటళ్ల యజమానులు, వీధి వ్యాపారులు, డెలివరీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.

ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆటోలకు వినియోగించే ఎల్పీజీ ధరలు ఇటీవల తీవ్రంగా పెరిగాయి. మార్చిలో లీటరుకు రూ.58–61 మధ్య ఉన్న ధరలు కొన్ని వారాల్లోనే రూ.105–120 వరకు పెరిగాయని చెప్పారు. ప్రైవేట్‌ ఔట్‌లెట్లలో అయితే లీటరుకు రూ.125–135 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఔట్‌లెట్లు చాలా వరకు పనిచేయడం లేదని తెలిపారు. ఇంధన కొరతను కూడా వారు ప్రస్తావించారు. బెంగళూరులో ముందుగా 60–70 ఎల్పీజీ/సీఎన్‌జీ స్టేషన్లు పనిచేస్తుండగా ప్రస్తుతం కేవలం 10–15 మాత్రమే పనిచేస్తున్నాయని, అంటే దాదాపు 80 శాతం స్టేషన్లు మూతపడ్డట్లేనని చెప్పారు. రోజువారీ సరఫరా కూడా 12,000 లీటర్ల నుంచి 6,000 లీటర్లకు తగ్గిందని, ఒక వాహనానికి రూ.400 విలువైన ఇంధనాన్ని మాత్రమే ఇస్తుండటంతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

బ్లాక్‌ మార్కెట్‌లో సిలిండర్‌‌ రూ.6 వేలు

వాణిజ్య ఎల్పీజీ ధరల పెరుగుదల చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. ఏప్రిల్‌ 1 నుంచి 19 కిలోల సిలిండర్‌పై రూ.200 పెరిగి ధర రూ.2,000 దాటిందని తెలిపారు. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.2,161కు చేరిందని చెప్పారు. బ్లాక్‌మార్కెట్‌లో అయితే ఒక సిలిండర్‌ను రూ.6,000 వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎల్పీజీ సరఫరాను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ద్వారా కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుందని వారు స్పష్టం చేశారు. రాష్ట్రాలకు కొనుగోలు లేదా పంపిణీపై ఎలాంటి నియంత్రణ లేదని తెలిపారు. అత్యవసర సరఫరా ఆదేశాలు ఇచ్చినా ఆయిల్‌ కంపెనీలు వాటిని పట్టించుకోవడం లేదని, ఇది పాలనలో వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు.

ఇది కేవలం ఇంధన సంక్షోభం మాత్రమే కాకుండా కోట్లాది ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తున్న అత్యవసర పరిస్థితి అని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నాయకత్వ వైఫల్యమే దీనికి కారణమని ఆరోపిస్తూ, ఈ ప్రజా అసంతృప్తి త్వరలో జరగనున్న దావణగెరె సౌత్‌, బాగల్‌కోట ఉప ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని హెచ్చరించారు.