Let's talk: editor@tmv.in
ఇంధన సంక్షోభం మధ్య క్యూబాకు రష్యా సహాయం

ఇంధన సంక్షోభం మధ్య క్యూబాకు రష్యా సహాయం

Dantu Vijaya Lakshmi Prasanna
21 మార్చి, 2026

క్యూబా దేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఇంధన, విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలు, అంతర్గత ఉత్పత్తి క్షీణించడం, ప్రధాన సరఫరాదారులైన వెనిజులా, మెక్సికోల నుండి మద్దతు తగ్గడంతో ఈ ద్వీప దేశం అంధకారంలో మునిగిపోయింది. ఈ క్రమంలో రష్యా నుండి వస్తున్న చమురు నౌకలు కొంత ఊరటనిస్తాయని ఆశించినప్పటికీ, అవి దేశ అవసరాలకు ఏమాత్రం సరిపోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్సాస్ యూనివర్సిటీ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ నిపుణుడు జార్జ్ పినోన్ విశ్లేషణ ప్రకారం, రష్యాకు చెందిన “అనాటోలీ కొలోడ్కిన్” అనే భారీ ట్యాంకర్ ప్రస్తుతం అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తోంది. సుమారు 7,30,000 బ్యారెళ్ల ముడి చమురుతో ఉన్న ఈ నౌక మరో 10 రోజుల్లో క్యూబా తీరానికి చేరనుంది. గత మూడు నెలలుగా క్యూబాకు ఎటువంటి చమురు సరఫరా జరగని నేపథ్యంలో, ఈ ఏడాదిలో రష్యా నుండి అందుతున్న మొదటి పెద్ద సరుకు ఇదే కానుంది.

అయితే, ఇది ముడి చమురు కావడంతో దీనిని వెంటనే ఉపయోగించడం సాధ్యపడదు. దీనిని శుద్ధి చేస్తే కేవలం 1,80,000 బ్యారెళ్ల డీజిల్ మాత్రమే లభిస్తుంది. క్యూబా రోజువారీ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇది కేవలం 9 నుండి 10 రోజులకు మాత్రమే సరిపోతుంది.

మరో రష్యా చమురు సరుకు “సీ హార్స్” అనే హాంకాంగ్ జెండా కలిగిన నౌక ద్వారా క్యూబాకు వస్తున్నట్టు సమాచారం. ఈ నౌక సుమారు 2,00,000 బ్యారెళ్ల డీజిల్ తరలిస్తోంది. అయితే క్యూబా రోజుకు సుమారు 20,000 బ్యారెళ్ల డీజిల్ వినియోగిస్తుండటంతో, ఇది దేశానికి మొత్తం డీజిల్ అవసరాన్ని తీరించకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సరుకును ముఖ్యంగా రవాణా, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో ఉపయోగించే అవకాశం ఉంది.

గ్రిడ్ వైఫల్యం - విద్యుత్ కోతలు

క్యూబా ప్రస్తుతం తన విద్యుత్ అవసరాల కోసం సహజ వాయువు, సౌరశక్తి, పాతబడిన థర్మోఎలక్ట్రిక్ ప్లాంట్లపై ఆధారపడుతోంది. కానీ ఇంధన కొరత కారణంగా జాతీయ గ్రిడ్ తరచూ కుప్పకూలుతోంది. దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటలకు పైగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇది కేవలం గృహాలకే కాకుండా, పర్యాటక రంగం, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పని గంటలు తగ్గించడంతో ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతోంది.

రాజకీయ ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి

క్యూబా కష్టాలకు ప్రధాన కారణం అమెరికా ఆంక్షలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన నిబంధనలు కొనసాగుతున్నాయి. క్యూబాకు చమురు సరఫరా చేసే దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని అమెరికా హెచ్చరించడంతో, మెక్సికో వంటి దేశాలు సరఫరాను నిలిపివేశాయి. వెనిజులాలో నెలకొన్న రాజకీయ అస్థిరత, అధ్యక్షుడు మడూరో అరెస్టు పరిణామాలు క్యూబాకు అందాల్సిన రాయితీ చమురును అడ్డుకున్నాయి.

కొన్ని నౌకలు, అంతర్జాతీయ ఆంక్షలు లేదా అమెరికా నుంచి శిక్షార్హమైన చర్యల నుండి తప్పించుకోవడానికి శాటిలైట్ ట్రాకింగ్ వ్యవస్థలను ఆపివేసి రహస్యంగా ప్రయాణిస్తున్నాయి, వాటి గమ్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టం అవుతోంది. ఇది సరఫరా గొలుసులో అనిశ్చితిని పెంచుతోంది.

ఈ రెండు నౌకలలో ఏదైనా చేరితే, ఇది ఈ ఏడాది క్యూబాకు రష్యా చమురు రవాణా మొదటి సారి అవుతుంది. గతం జనవరి 9న మెక్సికోలోని పజారిటోస్ పోర్ట్ నుంచి “ఓషన్ మరినర్” నౌక 85,000 బ్యారెళ్ల చమురు తరలించడం తెలిసిన విషయమే.

ఆర్థిక పతనం, మానవతా సాయం

2020లో కోవిడ్-19 విజృంభణ తర్వాత క్యూబా ఆర్థిక పరిస్థితి దిగజారింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడం, ఆహారం, మందుల కొరత కారణంగా యువత పెద్ద సంఖ్యలో దేశం విడిచి వలస వెళ్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఐరోపాకు చెందిన కార్యకర్తలు, బ్రిటన్ ఎంపీ జెరెమీ కార్బిన్ వంటి వారు మానవతా దృక్పథంతో సాయం అందిస్తున్నారు. సుమారు 30 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య సామాగ్రి, సౌర ప్యానెల్లను మూడు నౌకల ద్వారా క్యూబాకు పంపుతున్నారు.

క్యూబా తన అవసరాలలో కేవలం 40 శాతం చమురును మాత్రమే సొంతంగా ఉత్పత్తి చేసుకోగలదు. మిగిలిన 60 శాతం దిగుమతులపైనే ఆధారపడాలి. రష్యా నుండి అందుతున్న ఈ అరకొర సరుకులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయే తప్ప, శాశ్వత పరిష్కారం కావు. అమెరికా ఆంక్షల సడలింపు లేదా అంతర్గత ఇంధన వనరుల పెంపుదల జరిగితేనే క్యూబా ఈ చీకటి రోజుల నుండి బయటపడగలదు.

ఇంధన సంక్షోభం మధ్య క్యూబాకు రష్యా సహాయం - Tholi Paluku