
ఇంధన సంక్షోభం: నేపాల్‌లో 2 రోజుల వారాంతపు సెలవు
పొరుగు దేశం నేపాల్‌ను తీవ్ర ఇంధన సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోవడంతో నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఇకపై వారానికి రెండు రోజులు (శని, ఆదివారాలు) ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ మండలి నిర్ణయం తీసుకుంది.
ఆదివారం నుంచి కొత్త నిబంధనలు
ప్రభుత్వ అధికార ప్రతినిధి సస్మిత్ పోఖ్రెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 6 నుంచి ఈ కొత్త సెలవుల నిబంధన అమల్లోకి రానుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలు కూడా ఆదివారం సెలవు పాటించాల్సి ఉంటుంది. ఇంధన పొదుపు కోసం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాహనాల రాకపోకలు తగ్గి చమురు నిల్వలు మరికొంత కాలం అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై పని దినాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి.
రికార్డు స్థాయికి చమురు ధరలు
నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ గత 18 రోజుల్లోనే మూడుసార్లు ధరలను పెంచడంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.15 పెరిగి రికార్డు స్థాయిలో రూ.202కు చేరగా, డీజిల్, కిరోసిన్ ధరలు రూ.182కి చేరుకున్నాయి. విమాన ఇంధనం ఏకంగా రూ.124 పెరిగి రూ.251కి చేరడం గమనార్హం. కేవలం 18 రోజుల వ్యవధిలోనే పెట్రోల్‌పై రూ.45, డీజిల్‌పై రూ.40 మేర భారం పడటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా, ఇంతటి భారీ పెంపు తర్వాత కూడా ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.34.36, డీజిల్‌పై రూ.120.54 చొప్పున నష్టపోతోందని అధికారులు వెల్లడించారు.
ఎలక్ట్రిక్ వాహనాలే ప్రత్యామ్నాయం
ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు నేపాల్ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు అవసరమైన చట్టపరమైన విధివిధానాలను రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాల నుంచి గట్టెక్కవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది.
