
ఇంధన రంగంలో సూపర్ పవర్‌గా ఎదగాలంటే భారత్‌తో నడవాల్సిందే: కెనడా
ప్రపంచ ఇంధన రంగంలో కెనడా ఒక తిరుగులేని శక్తిగా (సూపర్‌పవర్) ఎదగాలంటే.. భారత్‌తో వాణిజ్యం చేయడం అనివార్యమని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి టిమ్ హడ్గ్‌సన్ స్పష్టం చేశారు. గోవాలో జరుగుతున్న 'ఇండియా ఎనర్జీ వీక్'కు హాజరైన ఆయన.. మంగళవారం భారత్‌తో ఇంధన బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఇంధన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారత్‌తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ఎనిమిదేళ్ల తర్వాత..
ఈ పర్యటనను ఒక 'చారిత్రక ఘట్టం'గా హడ్గ్‌సన్ అభివర్ణించారు. కెనడా ఫెడరల్ మంత్రి ఒకరు ఇండియా ఎనర్జీ వీక్‌కు రావడం ఇదే మొదటిసారి అని, అలాగే గడిచిన ఎనిమిదేళ్లలో భారత్-కెనడాల మధ్య ఇంధన చర్చలు జరగడం కూడా ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా, తన ఎగుమతులను రెట్టింపు చేయాలన్న కెనడా ప్రధాని లక్ష్యానికి ఈ పర్యటన ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చైనాను మించిన డిమాండ్
రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఇంధన అవసరాలు చైనా, ఆగ్నేయాసియా దేశాల మొత్తం డిమాండ్ కంటే ఎక్కువగా ఉండబోతున్నాయని కెనడా అంచనా వేస్తోంది. సాంప్రదాయ ఇంధనంతో పాటు క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛ ఇంధనం) కోసం భారత్ చేస్తున్న అన్వేషణ కెనడాకు ఒక గొప్ప అవకాశమని హడ్గ్‌సన్ పేర్కొన్నారు. ముఖ్యంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ), యురేనియం, కీలక ఖనిజాలను భారత్‌కు సరఫరా చేసేందుకు కెనడా సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. గ్యాస్ నిల్వల కోసం 'ఫ్లోటింగ్ స్టోరేజ్' వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాల రంగంలోనూ సహకరిస్తామన్నారు.
2050 నాటికి తిరుగులేని శక్తిగా భారత్: హర్దీప్ పూరి
ఇదే వేదికపై భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి మాట్లాడుతూ, "ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్.. 2050 నాటికి అంతర్జాతీయ ఇంధన డిమాండ్‌లో 30-35 శాతం వాటాను ఆక్రమిస్తుంది. ఇది ప్రపంచ మొత్తం డిమాండ్‌లో 10 శాతానికి సమానం" అని ఆయన వివరించారు. భారత్‌లో తలసరి ఇంధన వినియోగం ప్రపంచ సగటులో కేవలం 40 శాతమే ఉందని, దీన్నిబట్టి మన వృద్ధికి ఇంకా ఎంత అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చని పూరి స్పష్టం చేశారు.
ఢిల్లీ వేదికగా మరిన్ని పెట్టుబడులు
గోవా పర్యటన అనంతరం హాడ్సన్ ఢిల్లీలో భారత ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు మరియు కెనడా వ్యాపార ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ ద్వైపాక్షిక చర్చల ద్వారా రెండు దేశాల మధ్య కొత్త పెట్టుబడులకు పునాది పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకుంటూనే, పర్యావరణ హితమైన ఇంధనం వైపు మళ్లడానికి కెనడా సహకారం ఎంతో కీలకం కానుంది.
