Let's talk: editor@tmv.in
ఇంధన రంగంలో పెట్టుబడులే లక్ష్యం: 24న విజయవాడలో 'ఇన్వెస్ట్‌మెంట్ బజార్‌'

ఇంధన రంగంలో పెట్టుబడులే లక్ష్యం: 24న విజయవాడలో 'ఇన్వెస్ట్‌మెంట్ బజార్‌'

Panthagani Anusha
22 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన విజయవాడ వేదికగా భారీ 'ఇన్వెస్ట్‌మెంట్ బజార్‌' (పెట్టుబడుల సదస్సు) నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంధన పరిరక్షణలో ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఏపీ, ఇప్పుడు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వినూత్న ఆర్థిక నమూనాలను, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆయన పేర్కొన్నారు.

ఈ భారీ వర్క్‌షాప్ నిర్వహణపై శనివారం విజయానంద్ విద్యుత్ రంగ సంస్థల ఉన్నతాధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన సామర్థ్య పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. కేవలం విద్యుత్ ఆదా చేయడమే కాకుండా తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన వనరులను పారిశ్రామిక వేత్తలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు.

ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి ఈ ఇన్వెస్ట్‌మెంట్ బజార్ కీలకం కానుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన 'బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారి ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ చొరవ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డెవలపర్లు, ఎనర్జీ సర్వీస్ కంపెనీలు తయారీదారులు బ్యాంకులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. దీనివల్ల పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలతో పాటు బ్యాంకులను నేరుగా సంప్రదించి రుణాలు పొందే అవకాశం లభిస్తుందని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ కార్యక్రమంపై ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (సీఈఓ పి. పుల్లా రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సుకు విశేష స్పందన లభిస్తోందని దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అగ్రశ్రేణి బ్యాంకర్లు, ప్రభుత్వ విధాన రూపకర్తలు కలిపి సుమారు 50 మందికి పైగా ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంధన వినియోగాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచే దిశగా ఈ ఇన్వెస్ట్‌మెంట్ బజార్ ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఇన్వెస్ట్‌మెంట్ బజార్‌అంటే ఏమిటి

'ఇన్వెస్ట్‌మెంట్ బజార్‌' అనేది పరిశ్రమలకు ఒక 'వన్-స్టాప్ సెంటర్' వంటిది. సాధారణంగా ఒక పారిశ్రామికవేత్త తన ఫ్యాక్టరీలో కరెంటు ఆదా చేసే కొత్త మిషన్లు పెట్టాలనుకుంటే సాంకేతికత కోసం ఒకరిని, అప్పు కోసం బ్యాంకుల చుట్టూ మరొకరిని తిరగాల్సి ఉంటుంది. కానీ ఈ 'బజార్ లో ఆధునిక మిషన్లు అమ్మే తయారీదారులు, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు అందరూ ఒకే వేదికపైకి వస్తారు. అంటే, పరిశ్రమలు తమ పెట్టుబడికి కావాల్సిన ఆర్థిక సాయం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే చోట పొందేందుకు వీలు కల్పించే ఒక ప్రత్యేక వ్యాపార వేదిక.

ఇంధన రంగంలో పెట్టుబడులే లక్ష్యం: 24న విజయవాడలో 'ఇన్వెస్ట్‌మెంట్ బజార్‌' - Tholi Paluku