Let's talk: editor@tmv.in
ఇంధనం కొరత లేదు.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు:కేంద్రం

ఇంధనం కొరత లేదు.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు:కేంద్రం

Pinjari Chand
27 మార్చి, 2026

దేశంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 60 రోజుల చమురు నిల్వలు ఉన్నాయని, ఒక నెలకు సరిపడే ఎల్పీజీ సరఫరా కూడా ముందుగానే భద్రపరచినట్లు తెలిపింది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇది ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారమని పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎక్కడా రేషన్ విధానం అమల్లో లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతమంది డీలర్లు ఆర్థిక సమస్యల వల్ల సరఫరా తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి క్రెడిట్ పరిమితిని ఒక రోజు నుంచి మూడు రోజులకు పెంచినట్లు తెలిపింది. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటికీ, భారత్ ఇప్పటికే ప్రత్యామ్నాయ వనరుల నుంచి వచ్చే 60 రోజుల సరఫరాను ఖరారు చేసుకున్నట్లు వెల్లడించింది. దేశంలోని రిఫైనరీలు 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. మొత్తంగా భారత్ వద్ద 74 రోజుల చమురు నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం సుమారు 60 రోజుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందువల్ల ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా భారత ప్రజలకు దాదాపు రెండు నెలల పాటు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని హామీ ఇచ్చింది.

తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

ఎల్పీజీ విషయంలో కూడా ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. రోజుకు సుమారు 80 వేల టన్నుల అవసరం ఉండగా, దేశీయ ఉత్పత్తి 50 వేల టన్నులకు పెంచినట్లు వెల్లడించింది. దిగుమతి అవసరం రోజుకు 30 వేల టన్నులకు తగ్గిందని పేర్కొంది. అదనంగా, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి 8 లక్షల టన్నుల ఎల్పీజీ సరుకు ముందుగానే భద్రపరచినట్లు తెలిపింది. దేశంలోని 22 దిగుమతి టెర్మినల్స్ ద్వారా ఇవి చేరుతున్నాయని పేర్కొంది. రోజుకు 50 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నామని వెల్లడించింది. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజల్లో భయం కలిగిస్తున్నారని ప్రభుత్వం హెచ్చరించింది. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇంధన రేషన్ విధానం, పరిమితులు అమలు చేస్తున్నప్పటికీ, భారత్‌లో అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేసింది. దేశంలో ఇంధన సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.