
ఇందూరు మున్సిపల్ పోరు: బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంపీ అర్వింద్ ప్రచారం
మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నిజామాబాద్ నగరం రాజకీయ వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ శనివారం వివిధ డివిజన్లలో పర్యటించి, బీజేపీ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం నిర్వహించారు.
గూపన్‌పల్లి హనుమాన్ దేవాలయం వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభలో 3వ డివిజన్ అభ్యర్థి చింతకింది ప్రసూనకు మద్దతుగా ఎంపీ అర్వింద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. అభివృద్ధి, పారదర్శక పరిపాలన కోసం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థులకు మద్దతు కోరుతున్నారు. ఇందూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ సభల్లో డివిజన్ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎంపీ పర్యటనతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
