Let's talk: editor@tmv.in
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘వాటర్ పాజిటివ్’ హోదా

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘వాటర్ పాజిటివ్’ హోదా

Shaik Mohammad Shaffee
2 డిసెంబర్, 2025

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోనే ఒక కీలక మైలురాయిని చేరుకుంది. సంవత్సరానికి 40 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్న విమానాశ్రయాలలో 'వాటర్ పాజిటివ్' హోదాను సాధించిన మొట్టమొదటి విమానాశ్రయంగా నిలిచింది.

ఈ అరుదైన ఘనతపై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ విదేహ్ కుమార్ జైపురియార్ సంతోషం వ్యక్తం చేశారు. వాటర్-పాజిటివ్ హోదాను సాధించడం అనేది బాధ్యతాయుతమైన వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ విమానయాన మౌలిక సదుపాయాల పట్ల తమకున్న నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఈ విజయం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దీర్ఘకాలిక లక్ష్యం అయిన 'నెట్-జీరో ఎయిర్‌పోర్ట్' దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని జైపురియార్ తెలిపారు. వాటర్ పాజిటివిటీ భూమిపై ఉన్న సహజ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండే సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని ఆయన వివరించారు.ఈ ఘనత సాధించడం ద్వారా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ విషయంలో దేశంలోని ఇతర విమానాశ్రయాలకు ఆదర్శంగా నిలిచింది.

'వాటర్ పాజిటివ్' అంటే ఏమిటి?

‘వాటర్ పాజిటివ్’ అంటే, ఒక సంస్థ లేదా ప్రదేశం తనకు అవసరమైన నీటి కంటే ఎక్కువ నీటిని పునరుద్ధరించడం లేదా భద్రపరచడం అన్నమాట. అంటే వాడిన నీటిని తిరిగి శుద్ధి చేయడం, భూగర్భజలాలను పునరుద్ధరించడం, వర్షపు నీటిని సేకరించడం వంటి చర్యల ద్వారా నీటి నిల్వలను పెంపొందించడం అని అర్థం. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వర్షపు నీటి సేకరణ, శుద్ధి చేసిన మురుగు నీటిని మళ్లీ వినియోగం, నీటి వృథాను తగ్గించే సాంకేతిక పద్ధతులు వాడుతోంది. ప్రయాణికులు, సౌకర్యాలు వినియోగించే నీటిని రీసైకిల్ చేసి, తిరిగి ఉద్యానాలకు, శుభ్రపరచడానికి వంటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా వాడిన దానికంటే ఎక్కువ నీటిని భూగర్భంలో నిల్వ చేస్తూ పర్యావరణాన్ని సంరక్షించడంలో ముందంజలో ఉంది.