
ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆడబిడ్డలను గౌరవించడానికి, మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి "కోటి చీరల పంపిణీ" కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 2034 నాటికి కోటి మంది మహిళలను "కోటిశ్వరులు"గా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారతను, ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ముఖ్యమైనదని, ప్రతి ఆడబిడ్డకు చీర అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టబడిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి విడతలో గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలను డిసెంబర్ 9 వరకు పంపిణీ చేయాలని ఆయన ప్రకటించారు. అనంతరం, మార్చి 1 నుంచి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ చీరల పంపిణీ కొనసాగించబడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.చీరల పంపిణీ ద్వారా ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మన ఆత్మగౌరవం. ప్రతి ఆడబిడ్డకు చీర అందుతుందని. ప్రతి మహిళా సంఘం, ఆడబిడ్డలకు సారె పెట్టాలన్న మన ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఇందిరా స్ఫూర్తితో మహిళా సంక్షేమం
అయితే ఈ కార్యక్రమం కేవలం చీరల పంపిణీతో పరిమితం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని,ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్‌బంక్‌లు అప్పగించడం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం (మహాలక్ష్మి పథకం) వంటి పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.బస్సులకు యజమానులను కూడా ఆడబిడ్డలను చేశామని, సోలార్ పవర్ ప్లాంట్లు అందించడానికి కూడా ప్రత్యేక కార్యాచరణలో ముందుకు వెళుతున్నామని వివరించారు.
మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.అంతకుముందు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. అనంతరం, పలువురు మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలు అందించి, రాష్ట్రవ్యాప్త పంపిణీకి శ్రీకారం చుట్టారు.
మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి: చీరల పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలి సీఎం
రాష్ట్రంలో మహిళల ఆర్థిక, సామాజిక స్థితిని పెంపొందించడానికి ప్రభుత్వం చేపట్టిన “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీర పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
మహిళల ఆందోళన చెందవద్దు
ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు చీర ఇవ్వడం సంప్రదాయం. ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె అందించాలనే సంకల్పంతో ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు.
లోటుపాట్లు లేని పారదర్శక పంపిణీ
చీరల పంపిణీలో ఎక్కడా లోటు, మోసమాటలు లేకుండా, సమన్వయంతో, పారదర్శకంగా జరగాలని. ప్రతి జిల్లాలో మండల కేంద్రాల్లో విడతల వారీగా చీరలు పంపిణీ చేయాలని, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక అధికారిని బాధ్యతల్లో నియమించాలన్నారు. ప్రజలకు ముందుగానే కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వడం తప్పనిసరి అని గమనించాల్సిన అంశంగా సీఎం పేర్కొన్నారు.చీరల పంపిణీ సుసంపన్నంగా జరగడానికి ఫేషియల్ రికగ్నిషన్, ఆధార్ నంబర్ నమోదు వంటి ఆధునిక విధానాలను ఉపయోగించి, ఎక్కడా తప్పులు జరగకుండా నిర్ధారించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఏ మహిళా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీలు, పట్టణాల్లో రెండో విడతలో కూడా చీరలు అందిస్తామని ఎవరూ చీర అందలేదన్న సమస్య ఎదుర్కోకూడదు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడం ప్రభుత్వ విధానం అని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆర్థిక సాధికారత చర్యలు
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పలు చర్యలను ముఖ్యమంత్రి వివరించారు.ప్రజా ప్రభుత్వాలు ఇప్పటికే మహిళలకు 27 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు, అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణ, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు వంటి అనేక అవకాశాలను అందిస్తూ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తున్నాయని, గతంలో డ్రెస్‌కోడ్ లేని కారణంగా మహిళా సంఘాలకు గుర్తింపు లభించకపోవడం, రుణాలు అందించడంలో నిర్లక్ష్యం జరిగిన పరిస్థితిని సరిదిద్దడంలో ప్రభుత్వం ముందున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మార్కెటింగ్ మరియు లక్ష్యం
శిల్పారామంలో కేటాయించిన ఇందిరా శక్తి బజార్‌లో మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు సీఎం తెలిపారు. అలాగే, ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తేవడానికి అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించుకునే అంశంపై ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే కుటుంబాల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సిరిసిల్ల సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఆసిఫాబాద్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి చీరల నాణ్యత, డిజైన్ బాగున్నాయని తెలిపారు. నారాయణపేట జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతితో ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల గురించి తెలిపారు.ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
