
ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో అవకతవకలు: ఎమ్మెల్యే దానం నాగేందర్
ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో అవకతవకలు జరిగాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హౌసింగ్ బోర్డు అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని విమర్శించారు.
మంగళవారం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖైరతాబాద్ నియోజకవర్గానికి కేటాయించాల్సిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అధికారులు అన్యాయం చేశారని ఆరోపించారు. నియోజకవర్గానికి మొత్తం 480 ఇళ్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం 120 ఇళ్లను మాత్రమే ఇచ్చారని తెలిపారు. మిగిలిన ఇళ్లను నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులకు కేటాయించారని ఆరోపించారు. లబ్ధిదారుల జాబితాలోనూ బయటివారి పేర్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ సమీక్షలోనూ ఎండీ బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇచ్చారని, తాను స్పీకర్ స్థానంలో ఉంటే ఎండీని సస్పెండ్ చేయించేవాడినని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని దానం నాగేందర్ మండిపడ్డారు. అధికారుల వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తానని హెచ్చరించారు.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు, తాము లోకల్ అని దానం అన్నారు. అధికారులు తమ మాట వినకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రభుత్వ అధికారులపై తాను దాడి చేసి జైలుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులు మాట వినకపోతే పాతబస్తీ ఎమ్మెల్యేల మాదిరిగా దౌర్జన్యం చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అర్హులైన స్థానికులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
