
ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏదో ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ఇది ప్రతి ఏటా కొనసాగే నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, గృహ నిర్మాణ పథకంపై ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణను ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతుందని, ఖాళీ హామీలు ఇవ్వదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొదటి దశ గృహాల కేటాయింపు పూర్తి కాగా, రెండో దశను ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. మిగతా దశలను దశలవారీగా అమలు చేస్తామని వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో పట్టణ ప్రాంతాల ప్రతి వార్డులోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
గతంలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన గిరిజన ప్రాంతాల్లో ఇళ్లను పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు అనుకూలంగా నిర్మాణ దశల్లో సడలింపులు కల్పిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్ష ఉండదని, కులం, మతం, రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా అత్యంత పేదలకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, జూన్–జూలై నాటికి తొలి దశలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో ఎక్కువ భాగం పూర్తి అవుతాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి పెట్టామని, లబ్ధిదారుల జీవనోపాధిపై ప్రభావం పడకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, గత ప్రభుత్వ 2బిహెచ్‌కే పథకం కింద పెండింగ్ బిల్లుల్లో 99 శాతం ఇప్పటికే క్లియర్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. మిగిలినవి కూడా త్వరలో చెల్లిస్తామని, పెండింగ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడానికి ప్రత్యేకంగా 99 రోజుల కార్యక్రమం అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
త్వరలో కొత్త డిజిటల్ మీడియా పాలసీ
రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం, డిజిటల్ మీడియా క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండు మూడు నెలల్లో సరికొత్త 'డిజిటల్ మీడియా పాలసీ' తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శాసన మండలిలో ప్రకటించారు.
మీడియా ప్రతినిధుల భద్రత, రక్షణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీపై కొన్ని అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి వివక్ష లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మొదట జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జి.ఓ.) అనంతరం అన్ని జర్నలిస్టు సంఘాల నుంచి సూచనలు, అభిప్రాయాలు స్వీకరించి, అవసరమైన మార్పులు చేసినట్లు వివరించారు.
డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అనే తేడా ప్రభుత్వం చూపదని మంత్రి అన్నారు. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇస్తామని, వారి సమస్యలను సమానంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
