Let's talk: editor@tmv.in
ఇండోర్ లాంగ్ జంప్‌లో లోకేశ్ సత్యనాథన్‌ కొత్త జాతీయ రికార్డు

ఇండోర్ లాంగ్ జంప్‌లో లోకేశ్ సత్యనాథన్‌ కొత్త జాతీయ రికార్డు

Shaik Mohammad Shaffee
16 ఫిబ్రవరి, 2026

అమెరికాలోని అర్కాన్సాస్ వేదికగా జరిగిన 'టైసన్ ఇన్విటేషనల్ 2026' అథ్లెటిక్స్ పోటీల్లో భారత అథ్లెట్ లోకేష్ సత్యనాథన్ అద్భుత ప్రదర్శన చేశారు. ఇండోర్ లాంగ్ జంప్ విభాగంలో 8.01 మీటర్ల దూరం దూకి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. తద్వారా ఇండోర్ లాంగ్ జంప్‌లో 8 మీటర్ల మైలురాయిని అధిగమించిన తొలి భారతీయ అథ్లెట్‌గా లోకేష్ చరిత్ర సృష్టించారు. 26 ఏళ్ల లోకేష్ ప్రస్తుతం అమెరికాలోని టార్లెటన్ స్టేట్ యూనివర్సిటీ తరఫున ఎన్‌సీఏఏ సర్క్యూట్‌లో పోటీ పడుతున్నారు.

పాత రికార్డు కనుమరుగు

లోకేష్ తాజా ప్రదర్శనతో 2023లో జెస్విన్ ఆల్డ్రిన్ నెలకొల్పిన 7.97 మీటర్ల జాతీయ రికార్డు కనుమరుగైంది. ఈ పోటీల్లో లోకేష్ అత్యంత స్థిరమైన ప్రదర్శన కనబరిచారు. తన ఐదు ప్రయత్నాల్లో వరుసగా 7.69 మీ., 7.94 మీ., 7.99 మీ., 8.01 మీ., 7.96 మీటర్ల దూరం దూకారు. ఈ 8.01 మీటర్ల రికార్డు లోకేష్ కెరీర్‌లోనే రెండో అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు 2023లో కాలిఫోర్నియాలో జరిగిన అవుట్‌డోర్ పోటీల్లో ఆయన 8.02 మీటర్ల దూరం దూకడం విశేషం. అయితే, ఈ కొత్త రికార్డును అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

దిగ్గజాల మధ్య అద్భుత పోరాటం

మొత్తం 16 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీల్లో లోకేష్ 8వ స్థానంలో నిలిచారు. ప్రపంచ స్థాయి దిగ్గజాలు పాల్గొన్న ఈ టోర్నీలో అమెరికాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ కార్డెల్ టించ్ 8.29 మీటర్ల జంప్‌తో మొదటి స్థానంలో నిలిచారు. 2019 వరల్డ్ ఛాంపియన్ తాజే గేల్ (జమైకా), రియో ఒలింపిక్ రజత పతక విజేత లువో మాన్యోంగా (దక్షిణాఫ్రికా) వంటి ప్రముఖులు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. ఇంతటి గట్టి పోటీ మధ్య లోకేష్ జాతీయ రికార్డు సృష్టించడం భారత అథ్లెటిక్స్ రంగానికి గర్వకారణంగా మారింది.

విజయ పరంపర

ఈ సీజన్‌లో లోకేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. జనవరిలో టెక్సాస్‌లో జరిగిన పోటీల్లో 7.80 మీటర్లతో మూడో స్థానంలో నిలిచిన ఆయన, ఆ తర్వాత వారం రోజుల్లోనే ఓక్లహోమాలో జరిగిన మీట్‌లో 7.83 మీటర్ల జంప్‌తో విజేతగా నిలిచారు. వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ టూర్ సిల్వర్ క్యాలెండర్‌లో భాగంగా జరిగిన ఈ టైసన్ ఇన్విటేషనల్ పోటీల్లో లోకేష్ ప్రదర్శన.. రాబోయే అంతర్జాతీయ పోటీలకు ఆయన సన్నద్ధతను చాటిచెబుతోంది.