
ఇండోర్ నీటి విషాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: రాహుల్ గాంధీ
దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా పేరొందిన ఇండోర్‌లో కలుషిత తాగునీటి కారణంగా చోటుచేసుకున్న మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటన ‘అర్బన్ మోడల్’ పేరుతో ప్రచారం చేస్తున్న పాలనపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన వ్యాఖ్యానించారు. భాగీరథ్‌పురా ప్రాంతంలో గత నెల సంభవించిన వాంతులు–విరేచనాల వ్యాప్తితో సుమారు 24మంది మరణించారు. చాలా మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. బాధితులైన రోగులు, మరణించిన వారి కుటుంబాలను శనివారం రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా ‘శుభ్రమైన తాగునీరు ప్రతి పౌరుడి మౌలిక హక్కు’ అని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి, శాసనసభ ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింగ్‌హార్‌లతో కలిసి రాహుల్ గాంధీ, బాంబే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నలుగురు రోగులను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భాగీరథ్‌పురా ప్రాంతాన్ని సందర్శించి మృతుల కుటుంబాలతో మాట్లాడారు.
ప్రజలకు శుభ్రమైన నీరు అందించడం, కాలుష్యాన్ని తగ్గించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైందని బాధిత కుటుంబాలను కలిసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో అన్నారు. ఇండోర్‌ను ‘స్మార్ట్ సిటీ, అర్బన్ మోడల్’గా ప్రచారం చేస్తున్నారని, కానీ అక్కడ ప్రజలు కలుషిత నీరు తాగి మరణిస్తున్నారని విమర్శించారు.ఇది కేవలం ఇండోర్ సమస్య కాదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఈ నీటి విపత్తుకు సంబంధించి ప్రభుత్వంలోని ఎవరైనా బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇండోర్‌లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సంపూర్ణ సహాయం, తగిన పరిహారం అందించాలని ఆయన కోరారు.
ప్రభుత్వం బాధ్యతలను తప్పించుకుంటోంది
బీజేపీ ప్రభుత్వం ప్రజలకు శుభ్రమైన నీరు అందించలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ, బాధిత కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న సమయంలో కూడా అధికార పార్టీ నేతలు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వ వైఖరి అమానుషం. దీన్ని సహించబోం అని హెచ్చరించారు. భాగీరథ్‌పురాలోని పెద్ద నీటి ట్యాంక్‌ను చూపిస్తూ మీడియా దృష్టి ఉండటంతో తాత్కాలికంగా గాయానికి బ్యాండేజ్ వేసినట్టుగా చర్యలు తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మీడియా దృష్టి మళ్లగానే పరిస్థితి మళ్లీ పాతదానిలాగే మారుతుందని వ్యాఖ్యానించారు. బాధితులు శాశ్వతంగా శుభ్రమైన తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. తన ఇండోర్ పర్యటన రాజకీయ ప్రేరణతో జరిగిందన్న బీజేపీ ఆరోపణలను ఆయన ఖండించారు.
నేను లోక్‌సభ ప్రతిపక్ష నేతను. ఇక్కడ ప్రజలు కలుషిత నీటితో మరణించారు. వారి సమస్యను లేవనెత్తడం, వారికి సహాయం చేయడం నా బాధ్యత. దీన్ని రాజకీయంగా పిలిచినా నాకు పరవాలేదు అని అన్నారు.
రూ. లక్ష సహాయం
డయేరియా వ్యాప్తిలో మరణించిన గీతా ధృవ్కర్ (64), జీవన్‌లాల్ బరేడే (80) ఇళ్లకు వెళ్లి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. అనంతరం ఒకచోట బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 16 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఉమాంగ్ సింగ్‌హార్ ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున సాయం అందించారు. భాగీరథ్‌పురా నివాసితుల ప్రకారం ఇప్పటివరకు 24 మంది వాంతులు–విరేచనాల వ్యాప్తితో మరణించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో మరణాల సంఖ్యను ఐదు నెలల శిశువు సహా ఏడుగురిగా పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్ కమిటీ రూపొందించిన ‘డెత్ ఆడిట్’ నివేదిక ప్రకారం భాగీరథ్‌పురాలో 15 మరణాలు ఈ వ్యాప్తికి ఏదో రూపంలో సంబంధం ఉన్నట్లు తేలింది. అధికారులు ఇప్పటివరకు 21 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం అందించినట్లు తెలిపారు. కొన్ని మరణాలు ఇతర వ్యాధుల వల్ల జరిగినప్పటికీ, మానవతా దృష్టితో అన్ని కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
