
ఇండోర్‌లో నీరు కాదు.. విషాన్ని పంచారు: రాహుల్ గాంధీ
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి పది మంది మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పేదలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ మౌనంగానే ఉంటారని ఆయన విమర్శించారు. ఇండోర్‌లో తాగునీటిలో మురుగు నీరు కలవడంతో డయేరియా వ్యాపించి పలువురు ప్రాణాలు కోల్పోవడంపై స్పందిస్తూ.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు పరిపాలనా వైఫల్యానికి కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించారు. దగ్గు సిరప్ వల్ల మరణాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత లోపాలు, ఇప్పుడు కలుషిత నీటితో ప్రజల మృతి – ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.
నీరు కాదు.. విషం పంపిణీ చేశారు
ఎక్స్ (ట్విటర్) వేదికగా రాహుల్ గాంధీ స్పందిస్తూ.. “ఇండోర్‌లో అధికారులు నీటిని కాదు, విషాన్ని సరఫరా చేశారు. ప్రజలు అల్లాడుతుంటే పాలక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది” అని ధ్వజమెత్తారు. బాధితుల ఇళ్లలో విషాదం నిండినా, వారికి అండగా ఉండాల్సింది పోయి బీజేపీ నేతలు అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన విమర్శించారు.
మంత్రి తీరుపై మండిపాటు
ఈ ఘటనపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధితో మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ అనుచిత పదాన్ని వాడటం వివాదాస్పదంగా మారింది. మంత్రి వాడిన పదజాలాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. కష్టాల్లో ఉన్న బాధితులకు ఓదార్పునివ్వాల్సిన ప్రభుత్వం, తన అహంకారాన్ని ప్రదర్శించడం దారుణమని విమర్శించారు.
ప్రజల ఫిర్యాదులు ఎందుకు పట్టించుకోలేదు?
కలుషిత నీరు వస్తోందని ప్రజలు పదేపదే మొరపెట్టుకున్నా అధికారులు ఎందుకు స్పందించలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 'తాగునీటిలో మురుగు నీరు ఎలా కలిసింది? ముప్పును గుర్తించిన వెంటనే సరఫరాను ఎందుకు నిలిపివేయలేదు? ఇంతటి దారుణానికి ఒడిగట్టిన బాధ్యులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు?' అని ఆయన నిలదీశారు. స్వచ్ఛమైన తాగునీరు అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని, అది ప్రజల ప్రాథమిక జీవించే హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఈ హక్కును హరించడానికి బీజేపీ 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం, వారి నిర్లక్ష్య పాలన, బాధ్యతారాహిత్యమే కారణమని రాహుల్ ఆరోపించారు.
మరణాల సంఖ్యపై భిన్న వాదనలు
ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ తెలిపిన వివరాల ప్రకారం.. భగీరథ్‌పురా ప్రాంతంలో కలుషిత నీటి వల్ల వ్యాపించిన డయేరియా కారణంగా 10 మంది మృతి చెందారు. అయితే, మృతుల సంఖ్య 14 వరకు ఉంటుందని స్థానికులు బలంగా వాదిస్తున్నారు. వీరిలో ఆరు నెలల పసికందు కూడా ఉన్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మరణాల సంఖ్యను ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు.
పైపులైన్ లీకేజీయే కారణమన్న అధికారులు
ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాధవ్ ప్రసాద్ హసానీ తెలిపిన వివరాల ప్రకారం.. తాగునీటి పైపులైన్‌లో ఏర్పడిన లీకేజీ వల్లే మురుగు నీరు కలిసినట్లు ల్యాబ్ నివేదికల్లో తేలింది. ముఖ్యంగా ఒక పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో, మరుగుదొడ్డి నిర్మించిన చోట ఈ లీకేజీ ఏర్పడటంతో మలమూత్రాలతో కూడిన వ్యర్థాలు నేరుగా తాగునీటిలో కలిశాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గత తొమ్మిది రోజులుగా ఈ ప్రాంతంలో సుమారు 1,400 మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
