Let's talk: editor@tmv.in
ఇండోర్‌లో కలుషిత నీటితో మరో వ్యక్తి మృతి?

ఇండోర్‌లో కలుషిత నీటితో మరో వ్యక్తి మృతి?

Pinjari Chand
29 జనవరి, 2026

ఇండోర్ కలుషిత తాగునీటి మరణాలు ఆగడం లేదు. ఇప్పటికే 28 మంది చనిపోయారని, ఇంకా మరణిస్తూనే ఉన్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ నగరంలోని భగీరథ్‌పురా ప్రాంతంలో 62 ఏళ్ల వ్యక్తి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. కలుషిత తాగునీటి వల్ల ఏర్పడిన విరేచనాలే ఆయన మృతికి కారణమని కుటుంబ సభ్యులు బుధవారం ఆరోపించారు. ఈ ఘటనతో కలిపి, కలుషిత నీటితో వ్యాప్తి చెందిన విరేచనాల కారణంగా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. భగీరథ్‌పురాకు చెందిన ఖుబ్‌చంద్‌ బంధయ్యా (62) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మంగళవారం ఇంట్లోనే మృతిచెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు.

ఖుబ్‌చంద్‌ కుమారుడు రోహిత్‌ మీడియాతో మాట్లాడుతూ గత 15–20 రోజులుగా మా నాన్న వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కలుషిత తాగునీరే దీనికి కారణం. భగీరథ్‌పురా అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లగా మందులు ఇచ్చారు. ఆస్పత్రిలో చేర్చాలని కోరినా అంబులెన్స్‌ పంపలేదు. చివరకు మంగళవారం ఇంట్లోనే ఆయన మృతిచెందారని వాపోయాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇండోర్‌ బెంచ్‌ మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు సమర్పించిన ‘డెత్‌ ఆడిట్‌’ నివేదిక ప్రకారం, భగీరథ్‌పురాలో సంభవించిన 16 మరణాలకు మాత్రమే నీటితో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలే కారణమై ఉండొచ్చని పేర్కొంది.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

భగీరథ్‌పురా ప్రాంతంలోని తాగునీటి సమస్యపై న్యాయ విచారణ జరిపేందుకు హైకోర్టు, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుశీల్‌ కుమార్‌ గుప్తా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విచారణ ప్రారంభమైన తేదీ నుంచి నాలుగు వారాల్లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. అధికారుల సమాచారం ప్రకారం భగీరథ్‌పురాలో గత డిసెంబర్‌ చివరినుంచి వాంతులు, విరేచనాల వ్యాప్తి మొదలైంది. ఈ ప్రాంతంలోని 51 బోరు బావుల్లో కలుషిత నీరు ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. నీటిలో ఈ.కోలి బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించడంతోనే వ్యాధి తీవ్రంగా వ్యాపించిందని అధికారులు తెలిపారు. మునిసిపల్‌ తాగునీటి పైప్‌లైన్‌లో లీక్‌ ఏర్పడటంతో సమీపంలోని మరుగుదొడ్డి నుంచి మురుగునీరు తాగునీటిలో కలిసిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

‘డెత్‌ ఆడిట్‌’ నివేదిక తప్పుల తడక

–హైకోర్టులో న్యాయవాది అజయ్‌ బగడియా

ఇండోర్‌లోని భగీరథ్‌పురా ప్రాంతంలో కలుషిత తాగునీటితో సంభవించిన మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ‘డెత్‌ ఆడిట్‌ నివేదిక’ అనేక విభేదాలు, లోపాలతో నిండిందని న్యాయవాది అజయ్‌ బగడియా మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఆరోపించారు. ఈ నివేదికలో 16 మరణాలు నీటితో సంబంధం ఉన్న వ్యాధి వల్ల జరిగాయని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, అదే విషయాన్ని వ్యాఖ్యల విభాగంలో ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. అలాగే మరో మూడు మరణాలపై స్పష్టత లేదని, మరో ఐదు కేసుల్లో అయితే మరణానికి కారణమే నమోదు చేయలేదని విమర్శించారు. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ విశ్వసనీయతపై తీవ్ర సందేహాలు కలిగిస్తోందన్నారు.

ఇదే సందర్భంలో హేమంత్‌ అనే వ్యక్తి మరణాన్ని ప్రస్తావించిన బగడియా, కలుషిత నీరు తాగడం వల్ల కలిగే లక్షణాలన్నీ అతనిలో కనిపించాయని చెప్పారు. అయితే ఈ మరణంపై చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో) నివేదిక ఆధారంగా పోస్టుమార్టం చేశామని చెప్పారని, ఆ నివేదికలో ‘వెర్బల్‌ ఆటాప్సీ’ అనే కొత్త పదాన్ని ఉపయోగించారని తెలిపారు. అయితే ఆ పదానికి స్పష్టమైన వివరణ ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు.

మునిసిపల్‌ కార్పొరేషన్‌ సమర్పించిన నివేదికపైనా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఎనిమిది ప్రమాణాల ఆధారంగా నీటిని పరీక్షించి, అది తాగదగినదేనని నిర్ధారించామని కార్పొరేషన్‌ చెప్పిందని తెలిపారు. అయితే ఇది సరిపోదని, కాలుష్య నియంత్రణ మండలి గతంలో 34 ప్రమాణాల ఆధారంగా నీటిని పరీక్షించి, భగీరథ్‌పురా సహా ఇతర ప్రాంతాల్లోని నీటిని తాగడానికి అనర్హమని తేల్చిందని గుర్తుచేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎందుకు 34 ప్రమాణాల ఆధారంగా నీటి పరీక్షలు చేయడం లేదు? అని బగడియా ప్రశ్నించారు. అంతేకాకుండా నీటి పరీక్ష విధానాన్ని హైకోర్టు ముందు దాచిపెట్టారని మునిసిపల్‌ కార్పొరేషన్‌పై ఆరోపించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మూడు రకాల నీటి పరీక్షా పద్ధతుల గురించి కోర్టులో తెలియజేసినట్లు చెప్పారు.

ఇక పైప్‌లైన్‌ పనుల విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయని తెలిపారు. తాజా టెండర్‌ ద్వారా సుమారు 9 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేశామని మునిసిపల్‌ కార్పొరేషన్‌ పేర్కొన్నదని చెప్పారు. అయితే ఇదే ప్రాంతంలో ఫిబ్రవరి 2023లో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో ఏడాది కాలానికి టెండర్‌ ఇచ్చి, ఆ పనులు ఫిబ్రవరి 2026లో పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే ఆ టెండర్‌ పనులు పూర్తయిన తర్వాత కూడా ప్రజలకు కలుషిత నీరు ఎలా అందింది? ఇది అతిపెద్ద ప్రశ్న. ఆ టెండర్‌లో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకపోతే ఈ మొత్తం ప్రక్రియ అర్థహీనమవుతుందని బగడియా వ్యాఖ్యానించారు.

ఈ కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసిందని, తీర్పు వెలువడిన తర్వాతే తదుపరి విచారణ తేదీని ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. విచారణకు హాజరైన చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ‘వెర్బల్‌ ఆటాప్సీ’పై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారని, ఎన్ని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారన్న వివరాలు కూడా సమర్పించలేదని అన్నారు. తాజా సమాచారం ప్రకారం మరో రెండు మరణాలు సంభవించాయని, దీంతో భగీరథ్‌పురా ప్రాంతంలో కలుషిత నీటితో మృతుల సంఖ్య 30కి చేరిందని ఆయన తెలిపారు.