
ఇండోనేషియా సుమత్రా దీవుల్లో 6.6 తీవ్రతతో భూకంపం
ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేసియాను గురువారం నాడు రెండు పెద్ద ప్రకృతి విపత్తులు వెంటాడాయి. ఇప్పటికే సైక్లోన్ సెన్యార్ వల్ల సంభవించిన వరదలు, కొండచరియల విపత్తుతో సతమతమవుతున్న సుమత్రా దీవిని భారీ భూకంపం వణికించింది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. భూకంప కేంద్రం ఆచే ప్రావిన్స్‌కు, సిమెయులు ద్వీపానికి సమీపంలో భూ ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది.
ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక ఏజెన్సీ (బీఎంకేజీ), పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాయి. అయితే భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్లు, భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు ఏడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు పూర్తి నివేదికలు అందలేదు.
సైక్లోన్ సెన్యార్ వరద విలయం
భూకంపానికి ముందే, సైక్లోన్ సెన్యార్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమత్రా దీవి ఉత్తర ప్రాంతంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం సంభవించింది. ఈ విపత్తుల్లో ఇప్పటివరకు 28 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. గత వారం రోజులుగా నార్త్ సుమత్రా ప్రావిన్స్‌లోని 11 నగరాలు, జిల్లాల్లో నదులు ఉప్పొంగి ప్రవహించాయి. బురద, రాళ్లు, చెట్లతో కొండ ప్రాంతంలోని గ్రామాలు ధ్వంసమయ్యాయి. మాండైలింగ్ నతాల్ ప్రాంతంలో వంతెనలు కూలిపోవడం, ప్రధాన రహదారులు దెబ్బతినడం, ముఖ్య ప్రాంతాల్లో విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్ అంతరాయం కలగడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.
ఇండోనేసియా తరచుగా ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం, అది పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతానికి దగ్గరగా ఉండటమే. రింగ్ ఆఫ్ ఫైర్ పసిఫిక్ మహాసముద్ర తీరం వెంబడి విస్తరించి ఉన్న భారీ టెక్టోనిక్ బెల్ట్. ప్రపంచంలో సంభవించే భూకంపాలలో దాదాపు 90 శాతం ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి. ఇండోనేషియాతో పాటు జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, అలస్కాలోని ద్వీపాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. సుమత్రా ద్వీపంలోనే 2004 డిసెంబర్‌లో వచ్చిన భారీ సునామీ కారణంగా ఇండోనేసియా, భారత్, శ్రీలంకతో సహా 9 దేశాల్లో 2.30 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆస్తి, ప్రాణ నష్టం పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
