
ఇండోనేషియా వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం: 16 మంది సజీవ దహనం
ఇండోనేషియా లోని ఉత్తర సులావేసి ప్రావిన్స్ రాజధాని మనాడో నగరంలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 16 మంది మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుందని ఇండోనేసియా అధికారులు తెలిపారు. షిన్‌హువా కథనం ప్రకారం, రానోమూట్ ప్రాంతంలోని పంటి వెర్ధా దమై అనే వృద్ధాశ్రమంలో రాత్రి సుమారు 8:36 గంటలకు మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆశ్రమంలో ఉన్న పలువురు బయటకు రాలేకపోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మనాడో నగర పాలక సంస్థ నుంచి మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రాత్రి 9:30 గంటల కల్లా అగ్నిప్రమాదాన్ని పూర్తిగా నియంత్రించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మనాడో సిటీ రీజినల్ హాస్పిటల్, పెర్మాట బుందా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను భయాంగ్కర ఆసుపత్రికి తీసుకెళ్లి గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు.
ఉత్తర సులావేసి ప్రాంతీయ పోలీసుల పబ్లిక్ రిలేషన్స్ అధికారి అలంష్యా పీ హసిబువాన్ మాట్లాడుతూ, మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మృతుల కుటుంబాలతో సమన్వయం చేసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ఫోరెన్సిక్ బృందాలతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థల పరిశీలన, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
ఇండోనేషియాలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వృద్ధాశ్రమ ఘటన కంటే ముందే, ఈ నెలలో రాజధాని జకార్తాలోని ఒక ఇంట్లో జరిగిన మంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇల్లు కేవలం నివాసం కోసమే కాకుండా, చిన్నపాటి వస్తువులు తయారు చేసే గోదాంగా కూడా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (కరెంట్ వైర్లు కలవడం) వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
