
ఇండోనేషియా మాస్టర్స్ 2026: క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు, లక్ష్యసేన్ ఓటమి
ఇండోనేషియా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. జకార్తాలోని ఇస్తోరా సెనయాన్ వేదికగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్య సేన్ పరాజయం పాలయ్యారు. హోరాహోరీగా తలపడినా విజయం వరించకపోవడంతో, ఈ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నీలో భారత్ సవాల్ ముగిసినట్లయింది.
సింధు పోరాటం వృథా
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ పీవీ సింధు చైనా క్రీడాకారిణి చెన్ యు ఫీతో తలపడింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సింధు 13-21, 17-21 తేడాతో ఓటమి పాలైంది. తొలి గేమ్‌లో చైనా ప్లేయర్ ఆది నుంచే ఆధిపత్యం ప్రదర్శించగా, రెండో గేమ్‌లో సింధు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో 10-6తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ, ఆ తర్వాత వరుస పాయింట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. వీరిద్దరి మధ్య జరిగిన 14 మ్యాచుల్లో సింధుకు ఇది ఎనిమిదో ఓటమి.
లక్ష్య సేన్‌కు తప్పని నిరాశ
పురుషుల సింగిల్స్‌లో యువ కెరటం లక్ష్య సేన్ కూడా క్వార్టర్ ఫైనల్‌లోనే ఇంటిదారి పట్టాడు. థాయ్‌లాండ్‌కు చెందిన పనిత్చాపోన్ తీరారత్సాకుల్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్ష్య 18-21, 20-22 తేడాతో పరాజయం చెందాడు. 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ప్రతి పాయింట్ కోసం ఇద్దరు ప్లేయర్లు చెమటోడ్చారు. ముఖ్యంగా రెండో గేమ్‌లో స్కోరు 20-20తో సమమైనప్పటికీ, ప్రత్యర్థి ఒత్తిడిని తట్టుకొని వరుసగా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.
ముగిసిన భారత ప్రయాణం
ఈ ఓటములతో జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో భారత సవాల్ ముగిసింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు బరిలో ఉన్నప్పటికీ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. ఇక భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు వచ్చే వారం థాయ్‌లాండ్‌లో జరగనున్న 'థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్ 300' టోర్నీలో పాల్గొననున్నారు. అక్కడైనా మన ఆటగాళ్లు అదరగొట్టి టైటిల్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
