Let's talk: editor@tmv.in
ఇండోనేషియా మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు, లక్ష్యసేన్

ఇండోనేషియా మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు, లక్ష్యసేన్

Pinjari Chand
23 జనవరి, 2026

అగ్రశ్రేణి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీ.వి. సింధు, లక్ష్య సేన్ ఇండోనేషియా మాస్టర్స్ (సూపర్ 500) టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో ఇద్దరూ ఆధిపత్యం కనబరుస్తూ ప్రత్యర్థులను ఓడించి చివరి ఎనిమిదికి అర్హత సాధించారు.

లక్ష్య సేన్ విజయం

2021 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్, హాంకాంగ్ చైనాకు చెందిన జేసన్ గునావాన్పై 21-10, 21-11 స్కోర్‌తో అలవోకగా విజయం సాధించాడు. ఈ మ్యాచ్ కేవలం అరగంటకు పైగా మాత్రమే సాగింది. 24 ఏళ్ల అల్మోరాకు చెందిన లక్ష్య సేన్, గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అతడు క్వార్టర్ ఫైనల్లో థాయిలాండ్ యువ ప్రతిభావంతుడు పనిచఫోన్ తిరరత్సకుల్ను ఎదుర్కొననున్నాడు. తిరరత్సకుల్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మలేషియాకు చెందిన లీ జీ జియాను ఓడించి సంచలనం సృష్టించాడు.

సింధు అనుభవంతో ముందడుగు

రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత పీ.వి. సింధు, డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్‌మార్క్ క్యేర్‌ఫెల్ట్పై 21-19, 21-18తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ ముగియడానికి 43 నిమిషాలు పట్టింది. క్వార్టర్ ఫైనల్లో సింధు, టోర్నీ టాప్ సీడ్, ప్రపంచ నంబర్ 4 చెన్ యూ ఫెయి (చైనా)తో తలపడనుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరూ 13 సార్లు ఎదురుపడగా, చెన్ యూ ఫెయి 7-6 ఆధిక్యంలో ఉంది. సింధు చెన్ యూ ఫెయిపై చివరిసారిగా 2019లో విజయం సాధించింది. ఈసారి ఆ రికార్డును మెరుగుపరచాలనే పట్టుదలతో ఉంది.

ఇతర భారత ఆటగాళ్ల ఫలితాలు

ప్రపంచ మాజీ నంబర్ వన్, 2021 ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్, చైనా తైపేకు చెందిన చౌ టియెన్ చెన్ ఎదుట తడబడి 11-21, 10-21తో ఏకపక్షంగా ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో అన్మోల్ ఖర్భ్, మాజీ ప్రపంచ చాంపియన్ నొజోమీ ఓకుహారాకు గట్టిపోటీ ఇచ్చి చివరకు 21-16, 14-21, 11-21తో 56 నిమిషాల పోరాటంలో పరాజయం పాలైంది పురుషుల డబుల్స్‌లో హరిహరన్ అమ్సకరుణన్ – ఎం.ఆర్. అర్జున్ జోడీ, ప్రపంచ నంబర్ 6, మూడో సీడ్ మలేషియా జోడీ మాన్ వీ చాంగ్ – కై వున్ టీ చేత 17-21, 21-9, 16-21తో ఓడిపోయింది. ఈ మ్యాచ్ 54 నిమిషాలు సాగింది.

ఇండోనేషియా మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు, లక్ష్యసేన్ - Tholi Paluku