
ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం.. 16 మంది దుర్మరణం
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సెంట్రల్ జావా రాష్ట్రంలోని సెమరాంగ్ నగర సమీపంలోని క్రాప్యాక్ టోల్ రోడ్డుపై జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.
జకార్తా నుంచి యోగ్యకర్తకు వెళ్తున్న బస్సు, మలుపు ఉన్న ఎగ్జిట్ ర్యాంప్ వద్ద అదుపు తప్పింది. అధిక వేగంతో వెళ్తున్న బస్సు ముందుగా కాంక్రీట్ బ్యారియర్‌ను ఢీకొని, ఆ తర్వాత పక్కకు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలువురు ప్రయాణికులు బస్సు నుంచి బయటకు ఎగిరిపడ్డారు. మరికొందరు బస్సు భాగాల మధ్య ఇరుక్కుపోయారని జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారి బుడియోనో తెలిపారు.
సమాచారం అందిన సుమారు 40 నిమిషాల తర్వాత పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అక్కడే ఆరుగురు మృతి చెందినట్లు గుర్తించారు. మరో 10 మంది ఆస్పత్రికి తరలించే సమయంలో, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 18 మందిని సమీపంలోని రెండు ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 13 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదానికి ముందు బస్సు అత్యధిక వేగంతో వెళ్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. అధిక వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని సెంట్రల్ జావా పోలీస్ చీఫ్ రిబుట్ హరి విబోవో చెప్పారు. బస్సును నడిపిన డ్రైవర్ రెగ్యులర్ డ్రైవర్ కాదని, అతడు ప్రత్యామ్నాయ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. అతడికి కూడా తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మత్తు పదార్థాలు, డ్రగ్స్ తీసుకున్నాడా అనే కోణంలో కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఇండోనేషియాలో రోడ్లు సరిగా లేకపోవడం మరియు పాత బస్సులను వాడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయని స్థానిక మీడియా పేర్కొంది.
