Let's talk: editor@tmv.in
ఇండోనేషియాలో ‘గ్రోక్’కు గ్రీన్ సిగ్నల్.. షరతులతో కూడిన అనుమతి

ఇండోనేషియాలో ‘గ్రోక్’కు గ్రీన్ సిగ్నల్.. షరతులతో కూడిన అనుమతి

Shaik Mohammad Shaffee
3 ఫిబ్రవరి, 2026

టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'గ్రోక్' ఇండోనేషియాలో తిరిగి కార్యకలాపాలను ప్రారంభించనుంది. అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శిస్తోందన్న ఆరోపణలతో కొన్ని వారాల క్రితం ఈ చాట్‌బాట్‌పై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తాజాగా తొలగించింది. అయితే ఈ అనుమతి పూర్తిగా షరతులతో కూడుకున్నదని, కఠిన పర్యవేక్షణలో మాత్రమే ఇది పనిచేయాల్సి ఉంటుందని ఇండోనేషియా కమ్యూనికేషన్ల శాఖ స్పష్టం చేసింది.

దిద్దుబాటు చర్యలకు ఎక్స్ హామీ

గ్రోక్ ద్వారా అసభ్యకరమైన, ఇతరుల అనుమతి లేకుండా రూపొందించిన లైంగిక చిత్రాలు బయటకు వస్తున్నాయనే ఆందోళనతో ఇండోనేషియా, మలేషియా దేశాలు గత జనవరిలో దీనిని నిషేధించాయి. ఈ నేపథ్యంలో ఎలోన్ మాస్క్ నేతృత్వంలోని 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) సంస్థ ఇండోనేషియా ప్రభుత్వానికి లిఖితపూర్వక హామీ ఇచ్చింది. దేశ చట్టాలకు లోబడి పని చేస్తామని, సేవల్లో తగిన మెరుగుదలలు చేస్తామని హామీ ఇచ్చింది. అశ్లీల కంటెంట్ రాకుండా కొన్ని ప్రత్యేక ఫీచర్లపై పరిమితులు విధించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

నిఘా నీడలో కార్యకలాపాలు

ఇండోనేషియా డిజిటల్ పర్యవేక్షణ విభాగం అధికారి అలెగ్జాండర్ సబర్ మాట్లాడుతూ, గ్రోక్ చాట్‌బాట్ పునఃప్రారంభం కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడే జరగాలని స్పష్టం చేశారు. ఎక్స్ (X) సంస్థ అమలు చేస్తామన్న భద్రతా మార్పులను తమ అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తారని తెలిపారు. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన సమాచారం ప్రచారమైనా లేదా చిన్నపిల్లల రక్షణకు భంగం కలిగించేలా ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నియమాలను పాటించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా, ఎటువంటి సంకోచం లేకుండా గ్రోక్ సేవలను మరోసారి నిలిపివేస్తామని ప్రభుత్వం గట్టిగా వెల్లడించింది.

మలేషియా బాటలోనే..

ఇంతకుముందే మలేషియా కూడా గ్రోక్‌పై నిషేధం విధించి, ఆ తర్వాత సంస్థ చేపట్టిన భద్రతా చర్యలపై సంతృప్తి చెందినకే అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయంలో గత వారమే మలేషియా అధికారులు 'ఎక్స్' ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ, టెక్ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించని పక్షంలో గట్టి చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.