ఇండో-నేపాల్ సరిహద్దులో ఏపి మద్యం స్కాం నిందితుడి అరెస్టు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలున్న రూ.3,500 కోట్ల మద్యం స్కాం కేసులో కీలక నిందితుడైన ప్రణయ్ ప్రకాష్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఆదివారం నేపాల్ సరిహద్దు వద్ద ప్రణయ్ ప్రకాష్‌ను గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అనంతరం సోమవారం అధికారికంగా కస్టడీలోకి తీసుకున్నామని ఒక సీనియర్ అధికారి తెలిపారు. “రెండు రోజుల క్రితమే నేపాల్ సరిహద్దులో అతడు పట్టుబడ్డాడు. అతడిని మా కస్టడీలోకి తీసుకున్నాం,” అని ఆ అధికారి పత్రికా సమావేశంలో చెప్పారు.
దర్యాప్తులో భాగంగా లభించిన సమాచారం మేరకు, ఉత్తరప్రదేశ్‌లోని సనౌలి డ్రై పోర్ట్ ప్రాంతం నుంచి దుబాయ్‌కు పారిపోయేందుకు ప్రణయ్ ప్రకాష్ యత్నిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడంతో, సమాచారం అందిన వెంటనే ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ మద్యం స్కాం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ప్రణయ్ ప్రకాష్ అరెస్టు దర్యాప్తులో కీలక మలుపుగా పోలీసులు భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పాత్రధారులు, అక్రమాలపై మరింత లోతైన విచారణ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రణయ్ ప్రకాష్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నామని, రాష్ట్రానికి తీసుకొచ్చిన అనంతరం కోర్టులో హాజరు పరచి రిమాండ్ కోరనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు సూచించాయి.
కాగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఇటీవల మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ముప్పిడి అవినాష్ రెడ్డి పోయిన గురువారం ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఎదుట లొంగిపోయారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
వైకాపా ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం సరఫరా, కొత్త బ్రాండ్లకు అనుమతులు, కొనుగోలు ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. 'లిక్కర్ సిండికేట్' పేరుతో ఒక వ్యవస్థీకృత ముఠా ఏర్పడి రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో అవినాష్ రెడ్డి కీలక సూత్రధారిగా వ్యవహరించారని సిట్ ఆరోపిస్తోంది. ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ నుంచి క్షేత్రస్థాయిలో వ్యూహాల అమలు వరకు ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ అరెస్టు ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపుగా పోలీసులు భావిస్తున్నారు.
