Let's talk: editor@tmv.in
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో 348 పోస్టులు

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో 348 పోస్టులు

Shaik Mohammad Shaffee
11 అక్టోబర్, 2025

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) 348 గ్రామీణ డాక్ సేవక్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 348 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 9, ఏపీలో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయో సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉంది.

ఎంపిక విధానం

అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతం ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. బ్యాంక్ అవసరాన్ని బట్టి తుది ఎంపిక కోసం ఆన్‌లైన్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు. మెరిట్ ఆధారంగా/టెస్ట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ సర్కిల్/రాష్ట్రాల వారీగా తయారు చేయబడుతుంది. దరఖాస్తు చేస్తున్న సర్కిల్/రాష్ట్రం నివాసితులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సాధారణంగా ఈ నియామకం ప్రారంభంలో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. వారి పనితీరు సంతృప్తికరంగా ఉంటే ఈ కాంట్రాక్ట్ మరో సంవత్సరం చొప్పున గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగిస్తారు.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు ముందుగా ఐపీపీబీ అధికారిక వెబ్‌సైట్ www.ippbonline.comను సందర్శించండి. ‘'కెరీర్స్' విభాగానికి వెళ్లి సంబంధిత నోటిఫికేషన్ (Engagement of Gramin Dak Sevak from Department of Posts to IPPB as Executive) కింద ఉన్న అప్లై బటన్ పై క్లిక్ చేయండి. అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత లాగిన్ అయ్యి, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా నింపండి. అవసరమైన పత్రాలు (ఫోటో, సంతకం మొదలైనవి) అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు రుసుము రూ.750 (అన్ని కేటగిరీలకు) ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తును ప్రింట్ అవుట్‌ను తీసుకోండి.

ఐపీపీబీ అంటే ఏమిటి?

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) అనేది భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పోస్ట్స్ డిపార్ట్‌మెంట్ యాజమాన్యంలో 2016లో స్థాపించబడిన ఒక పేమెంట్స్ బ్యాంక్. దేశంలోని ప్రతి మూలకు ముఖ్యంగా గ్రామీణ, కొండ ప్రాంతాలోని ప్రజలకు సులభంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అందించడం ఈ బ్యాంక్ లక్ష్యం. ఇది పోస్టాఫీసుల విస్తృత నెట్‌వర్క్, పోస్ట్‌మ్యాన్/గ్రామీణ డాక్ సేవక్‌ల నెట్‌వర్క్‌ను ఉపయోగించి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ బ్యాంక్ పొదుపు ఖాతాలు, కరెంట్ ఖాతాలు, మనీ ట్రాన్స్‌ఫర్, బిల్లు చెల్లింపులు, బీమా, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక సేవలను అందిస్తుంది.

ఐపీపీబీలో మొత్తం ఉద్యోగుల సంఖ్యపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఐపీపీబీకి దేశవ్యాప్తంగా సుమారు 650 బ్రాంచీలు ఉన్నాయి. దీంతో పాటు పాటు దేశంలోని 1,55,015 పోస్ట్ ఆఫీసులను ఐపీపీబీ తన బ్యాంకింగ్ సేవలను అందించే యాక్సెస్ పాయింట్‌లుగా ఉపయోగించుకుంటోంది. అంటే దాదాపు ప్రతి పోస్టాఫీసు ఐపీపీబీ సేవలను అందిస్తుందన్నమాట. దాదాపు 3 లక్షల మంది పోస్ట్‌మ్యాన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌ల (జీడీఎస్) క్షేత్ర స్థాయి నెట్‌వర్క్‌ను వినియోగించుకోవడం ద్వారా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందించాలని ఐపీపీబీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ నియామక ప్రక్రియను చేపట్టింది.