
ఇండియా పెట్టుబడిదారులకు నమ్మకమైన భాగస్వామి: ప్రధాని నరేంద్రమోడీ
ఫ్రాన్స్ దిగ్గజం సఫ్రాన్ సంస్థ హైదరాబాద్‌లో రూ.1300 కోట్లతో నిర్మించిన లీప్ ఇంజిన్ల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ‘ఇండియా ఇప్పుడు రిఫార్మ్‌లు చేసే దేశం.. పెద్ద నిర్ణయాలు తీసుకునే దేశం. పెట్టుబడిదారులకు నమ్మకమైన భాగస్వామి’ అంటూ గర్వంగా ప్రకటించారు. మన దేశంలో గతంలో 85 శాతం విమానాల ఎంఆర్‌ఓ పనులు విదేశాల్లో జరిగేవి. ఖర్చు ఎక్కువ. టైం ఎక్కువ. విమానాలు గ్రౌండెడ్ అయిపోయేవి. ఇక అది చరిత్ర. ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద ఎంఆర్‌ఓ హబ్‌గా తయారు చేస్తున్నాం’ అని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
సఫ్రాన్ కేంద్రం ప్రత్యేకతలు
..
2026 నుంచి పూర్తి స్థాయిలో సఫ్రాన్ కార్యకలాపాలు చేపడుతోంది. ఏటా 300 లీప్ ఇంజిన్లకు డీప్ లెవెల్ సర్వీసింగ్ ఇస్తుంది. 2035 నాటికి 1000 మంది అత్యంత నైపుణ్యం గల భారతీయ ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలోనే తొలిసారిగా గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మేకర్ డీప్ ఓవర్‌హాల్ సౌకర్యం ఉంటుంది. అలాగే షిప్పింగ్ ఎంఆర్‌ఓ, ప్రొపల్షన్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్‌లోనూ భారత్‌ను ప్రపంచ నంబర్ వన్‌గా నిలపాలని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘సఫ్రాన్ ఇక్కడి యువ టాలెంట్‌ను వాడుకోవాలి.. ఇండియాలోనే ప్రొపల్షన్ డిజైన్, తయారీ చేయాలి’ అని సూటిగా సూచించారు.
విమానయాన రంగంలో భారత్ రికార్డు..
దీంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా ఇండియా నిలుస్తోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గానూ ఉండనుంది. భారత విమానయాన సంస్థలు 1500 కంటే ఎక్కువ కొత్త విమానాల ఆర్డర్లు ఇచ్చాయి. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు మోడీ గ్యారంటీ ఇచ్చారు. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, జీఎస్టీ, ఫేస్‌లెస్ టాక్స్ అసెస్‌మెంట్, కొత్త లేబర్ కోడ్‌లు, దివాలా చట్టం, చాలా రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐ.. డిఫెన్స్‌లో 74 శాతం ఆటోమేటిక్ ఎఫ్‌డీఐ, అంతరిక్ష రంగంలో భారీ లిబరలైజేషన్ ను ఇచ్చామని తెలిపారు. పెట్టుబడి పెట్టే వారిని కేవలం ఇన్వెస్టర్లుగా కాదు. వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములుగా భావిస్తాం’ అని మోడీ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యూహానికి ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచామని, ఆర్థిక పునాదులు బలోపేతం చేశామని, వ్యాపారం చేసుకోవడానికి సులువుగా, పారదర్శకంగా నిబంధనలను మార్చామన్నారు.
హైదరాబాద్‌లో సఫ్రాన్ ప్లాంట్‌తో దక్షిణ భారత యువతకూ వేలాది ఉద్యోగ అవకాశాలు.. దేశీయ సామర్థ్యం పెరుగుతుందన్నది మోడీ ధీమా. ఇక ఇండియా కేవలం మార్కెట్ మాత్రమే కాదు, మాన్యుఫాక్చరింగ్ హబ్, టెక్నాలజీ హబ్, ఎంఆర్‌ఓ హబ్‌గా ఎదుగుతోందన్న సందేశమే ఈ కార్యక్రమం నుంచి బలంగా వినిపించింది.
ఎయిర్, రక్షణ రంగాలకు తెలంగాణ ప్రధాన కేంద్రం సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ స్థాపన తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన ముందడుగుగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ గ్రూప్, జీఎంఆర్ ఎయిరోపార్క్ (ఎస్ఈజెడ్)లో ఏర్పాటు చేసిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎయిరోస్పేస్, రక్షణ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని ఆయన చెప్పారు. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని బెంగళూరు–హైదరాబాద్‌ను డిఫెన్స్, ఎయిరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానిని సీఎం కోరారు. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని సాఫ్రన్, బోయింగ్, ఎయిర్‌బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ సంస్థలు నిర్వహణ, మరమ్మతులు (ఎంఆర్ఓ), పరికరాల తయారీ, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతున్నాయి. సాఫ్రన్ సంస్థ తెలంగాణపై నమ్మకంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. సాఫ్రన్ ఏర్పాటు చేసిన ఈ సెంటర్ దేశంలో తొలి ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసింగ్ సౌకర్యమని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా ఆ సంస్థకు చెందిన ఎం88 మిలిటరీ ఇంజిన్‌ల ఎంఆర్ఓ సెంటర్‌కు శంకుస్థాపన జరగడం భారత వైమానిక దళం, నౌకాదళానికి దోహదపడుతుందని తెలిపారు. దాదాపు రూ.1300 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈసెంటర్ లో వెయ్యి మందికి పైగా నైపుణ్యం కలిగిన సిబ్బందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
తెలంగాణ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రం
పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్రం ప్రగతిశీల విధానాలు అమలు చేస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్ఎంఈ విధానం దేశంలోనే ఉత్తమంగా నిలిచిందని అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్‌లు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. గతేడాదితో పోల్చితే ఎయిరోస్పేస్ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని, గడిచిన 9 నెలల్లో రూ.30,000 కోట్లను దాటి, మొదటిసారి ఫార్మా ఎగుమతులను అధిగమించడం గమనార్హమన్నారు. ఈ రంగంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అవార్డు తెలంగాణకు లభించిందని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో 100 ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
భారత్ ఫ్యూచర్ సిటీ – తెలంగాణ
హైదరాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 30వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు పారిశ్రామిక, వ్యాపార వేత్తలను ఆహ్వానించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్లు విలువైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల–ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సాఫ్రన్ చైర్మన్ రాస్ మెకలెన్స్, సీఎస్ ఒలివర్ అండ్రీస్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సీఈవో స్టీఫెన్ క్యూయెల్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు తదితర ప్రముఖులు హాజరయ్యారు.
లీప్ ఇంజిన్ — ప్రపంచాన్ని లాగేస్తున్న ‘సూపర్ పవర్’
ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్, అమెరికా దిగ్గజం జీఈ కలిసి అభివృద్ధి చేసిన లీప్ (ఎల్ఈఏపీ) ఇంజిన్ ప్రస్తుతం గ్లోబల్ విమానయాన రంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్తోంది. తక్కువ ఇంధన వినియోగం, తక్కువ శబ్దం, అధిక సామర్ధ్యం లక్షణాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆర్డర్లు అందుకుంటూ ఈ ఇంజిన్ తన ప్రత్యేకతను చాటుతోంది. ఈ ఇంజిన్‌తో ప్రయాణించే విమానాలు ఒక్కసారిగా 30 వేల కిలోమీటర్లు కవర్ చేయగల శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పటికే 40 వేలకుపైగా ఇంజిన్లు ఆర్డర్ రావడం, ఒక్కోటి దాదాపు రూ.125 కోట్లు ఖర్చవడం… మొత్తం ఆర్డర్ల విలువ రూ.50 లక్షల కోట్లు దాటడం లీప్ ఇంజిన్ సామ్రాజ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
లీప్ ఇంజిన్ వినియోగిస్తున్న విమానయాన సంస్థలు
• ఎయిర్‌బస్ ఏ320నియో (ఇండిగో, అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా విమానాల్లో)
• బోయింగ్ 737 మ్యాక్స్, చైనా కోమాక్ సీ–919
• ఇండిగో ఒక్కటే 1,000 పైగా ఏ320నియో ఆర్డర్ చేయడంతో, రోజూ భారత గగనతలంలో 2 వేలకుపైగా లీప్ ఇంజిన్లు విహరిస్తున్నాయి.
పాత తరాన్ని మించి లీప్ ప్రత్యేకతలు
• లీప్ ఇంజిన్ పూర్వ తరమైన సీఎఫ్ఎం 56 తో పోలిస్తే, ఇంధన వినియోగం 15–20శాతం తక్కువ, శబ్దం 50శాతం తగ్గింపు
• కార్బన్ ఫైబర్ బ్లేడ్లు — తక్కువ బరువుతో ఎక్కువ శక్తి
• సీఎంసీ (సిరామిక్ మ్యాట్రిక్స్ కాంపోజిట్స్) — 3,000°C ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది.
• రోజుకు 6 ఇంజిన్లు తయారీ, ఒక్కోటి 10 టన్నుల థ్రస్ట్
ఈ సాంకేతికతలతో లీప్ ఇంజిన్ ప్రపంచ విమానయానంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. సింగపూర్, ఫ్రాన్స్, అమెరికాలకు పంపిన ఇంజిన్లను ఇకపై దేశ ఇంజినీర్లే సరి చేయబోతున్నారు అన్నమాట.
దిగ్గజ సంస్థ సాఫ్రన్
• ప్రపంచ టాప్-3 ఏరోస్పేస్ కంపెనీల్లో ఒకటి
• వార్షిక టర్నోవర్: రూ.2.5 లక్షల కోట్లు
• 92,000 మంది ఉద్యోగులు, 50 దేశాల్లో కార్యకలాపాలు
• విమానానికి అవసరమైన అనేక ముఖ్య భాగాల తయారీ
• లీప్, రాఫేల్ ఎం88 ఇంజిన్‌లు
• హెలికాప్టర్ ఇంజిన్‌లలో ప్రపంచ నం.1
• రాకెట్ ల్యాండింగ్ గేర్, బిజినెస్ క్లాస్ సీట్లు మొదలైనవి
• భారతదేశంతో 60 ఏళ్ల బంధం ఉంది. హెచ్ఏఎల్ తో కలిసి శక్తి ఇంజిన్ లు రూపొందించింది. రాఫేల్‌లో 30శాతం విడి భాగాలు భారత్ లో తయారైనవే.
