Let's talk: editor@tmv.in
ఇండియా గేట్‌ వద్ద కలకలం:పెప్పర్ స్ప్రేతో పోలీసులపై దాడి

ఇండియా గేట్‌ వద్ద కలకలం:పెప్పర్ స్ప్రేతో పోలీసులపై దాడి

Pinjari Chand
25 నవంబర్, 2025

ఇండియా గేట్‌ వద్ద సోమవారం జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాలుష్యంపై నిరసన పేరుతో కూడిన ఆందోళనను పోలీసులు నియంత్రించేందుకు ప్రయత్నించగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఆందోళనకారులు పెప్పర్ స్ప్రే ఉపయోగించి పోలీసులపై దాడిచేయడంతో పోలీసులు భగ్గుమన్నారు. ఈ ఘటనలో 22 మందిని పోలీసు బలగాలు అరెస్ట్ చేశాయి. యువత భారీ సంఖ్యలో బ్యారికేడ్లు కూల్చి రోడ్డుపై కూర్చోవడంతో సీ–హెక్సాగన్‌లోకి రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను నిరసనకారులు కూల్చివేశారు. అనంతరం రద్దీగా ఉండే మార్గంలో రోడ్డంతా ఆక్రమించి కూర్చోడంతో అంబులెన్సులు, మెడికల్ వాహనాలు నిలిచిపోయాయి. అనేక సార్లు కోరినా వినకపోవడంతో పోలీసు సిబ్బంది వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో కొందరు నిరసనకారులు తెచ్చుకన్న పెప్పర్ స్ప్రేను పోలీసులు మీదకు చల్లారు. దీంతో కొందరు పోలీసుల కళ్లలో మంటలు, నీరసం రావడంతో వారిని ఆర్‌ఎమ్‌ఎల్‌ ఆసుపత్రికి తరలించారు.

రెండు కేసులు నమోదు

ఈ ఘటనపై పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. కార్తవ్యపథ్ పోలీస్ స్టేషన్‌లో 6గురు నిరసన కారులు అరెస్ట్ అయ్యారు. సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోనూ కేసులు నమోదయ్యాయి.

హిడ్మా పోస్టర్లతో కలకలం

ఆందోళన సందర్భంగా కొందరు మావోయిస్టు కమాండర్ మడ్వి హిడ్మా పోస్టర్లను పట్టుకున్నట్టు వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ అంశంపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

అవును మావోయిస్టుల పోస్టర్లు ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన వివరాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది అని డీసీపీ దేవేశ్ మహ్లా తెలిపారు. పోలీసులు తొలిసారిగా ఇలాంటి అల్లర్లలో స్ప్రే దాడిని ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బ్యారికేడ్లు ధ్వంసం చేసి రోడ్డు బ్లాక్ చేశారు. మా సిబ్బందిపై పిచికారీ చేశారు. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

కాలుష్యమే అసలు అంశం నిరసన అసలు ఉద్దేశం కాలుష్యాన్ని తగ్గించే చర్యలను ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేయడమేనని తెలుస్తోంది.

అయితే ఈ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో మొత్తం దృష్టి ఆ అల్లర్లపైనే నిలిచిపోయింది. సోమవారం ఢిల్లీని మళ్లీ దట్టమైన పొగమంచు కమ్మేసింది. సగటు ఎయిర్ క్వాలిటీ ‘వెరీ పూర్’ కేటగిరీలో నమోదైంది. ఏక్యూఐ 396గా నమోదైంది. జీఆర్ఏపీ –III అమల్లో ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.

ఇండియా గేట్‌ వద్ద కలకలం:పెప్పర్ స్ప్రేతో పోలీసులపై దాడి - Tholi Paluku