
ఇండియా కూటమి లైఫ్ సపోర్ట్ పైనే ఉంది: ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా శనివారం ఇండియా విపక్ష కూటమి పరిస్థితి గురించి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ సదస్సులో మాట్లాడిన ఆయన ఇండియా కూటమి ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ మీదే ఉంది. ఒక్కోసారి ఎవరో ప్యాడిల్స్ తీసుకొచ్చి షాక్ ఇస్తే మళ్లీ లేచి నిలబడుతుంది. కానీ బీహార్ ఎన్నికల ఫలితాల్లాంటివి వస్తే మళ్లీ కింద పడిపోతుంది. ఇక ఐసీయూలోకి తీసుకెళ్లాల్సిందే అని చతురతగా తెలిపారు.
బీజేపీతో పోల్చితే ఇండియా కూటమిలో సంస్థాగతంగా, వ్యూహాత్మక వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని ఒమర్ ఆరోపించారు. బీజేపీకి అసాధారణమైన ఎన్నికల యంత్రాంగం ఉంది. డబ్బు కంటే కూడా వాళ్ల పని శైలి ఎక్కువ. వాళ్లు ప్రతి ఎన్నికనూ తమ ప్రాణాలు ఆధారపడినట్లు పోరాడతారు.
మనం మాత్రం ఎన్నికలను ‘ఏమైనా పర్వాలేదు’ అన్నట్లు ఎదుర్కొంటాం అని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ ఆయన బృందం 24×7 రాజకీయాలు చేస్తారని, ఒక ఎన్నిక ముగిసిన వెంటనే తదుపరి రాష్ట్రంలోకి దూకేస్తారని ఒమర్ చెప్పారు. మనం మాత్రం ఎన్నికలకు రెండు నెలల ముందే అక్కడికి వెళ్తాం. నామినేషన్ల ఆఖరు తేదీకి ముందు పొత్తులు కుదిరితే భాగ్యం అని ఎద్దేవా చేశారు.
నితీష్ ఎన్డీఏలో చేరడానికి ఇండియా కూటమే కారణం
నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏలో చేరడానికి ఇండియా కూటమే కారణమని ఒమర్ నేరుగా ఆరోపించారు. మేమే నితీష్‌ను బీజేపీ ఒడిలోకి తోసేశాం అని నా భావనఅన్నారు. బీహార్‌లో సీట్ల సర్దుబాటులో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను కావాలనే పక్కన పెట్టడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ చుట్టూ ఐక్యంగా నిలబడాలని ఆయన సూచించారు. పాన్-ఇండియా ఉనికి ఉన్న ఏకైక పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే. ప్రాంతీయ పార్టీలకు భౌగోళిక పరిమితులు ఉన్నాయి. కాబట్టి భారీ పని కాంగ్రెస్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ముస్లిం ఓటు గురించి మాట్లాడుతూ, సాంప్రదాయంగా ఆ ఓటు అందుకున్న పార్టీలు సమాజాన్ని ‘గ్యారంటీ ఓటుగా’ భావించి తప్పు చేశాయని అన్నారు. ఎన్నికల ముందు మాత్రమే వచ్చి మాటలు చెప్పి, మిగతా ఐదేళ్లూ మర్చిపోవడం వల్లే ఏఐఎంఐఎం లాంటి పార్టీలకు అవకాశం కల్పించాం అని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితం “అదృష్ట వశాత్తు” కాదని, దేశ ప్రజలు మోడీ ప్రభుత్వానికి ఒక సందేశం పంపారని చెప్పారు. ఇప్పుడు కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా దాన్ని ఎవరూ గుర్తు చేసుకోవడం లేదు. బీజేపీ ప్రభుత్వం అని అనేవాళ్లు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు. ఇవి చిన్న మార్పులే అయినా చాలా ముఖ్యమైనవని అన్నారు.
ఈవీఎంలలో మోసం అనే ఆరోపణల్ని నమ్మలేదు.
నేను ఈవీఎంలు రిగ్గింగ్ అయ్యాయని ఎప్పుడూ అనలేదు. కానీ ఎన్నికల్ని మానిప్యులేట్ చేయొచ్చు. ఓటరు జాబితా ద్వారా, కాన్స్టిట్యున్సీల రూపకల్పన ద్వారా” అని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో జో డీలిమిటేషన్‌ను మానిప్యులేషన్ గానే ఆయన అభివర్ణించారు. చివరగా హాస్యంగా నా తండ్రి (ఫారూక్ అబ్దుల్లా) వాట్సాప్‌లో వచ్చిన ప్రతిదీ నమ్మేస్తారు, అందుకే ఈవీఎంలు రిగ్గయ్యాయంటారు అని తెలిపి ఒమర్ నవ్వించారు.
