Let's talk: editor@tmv.in
ఇండియా కూటమిని ఏకం చేస్తాం: అఖిలేష్ యాదవ్

ఇండియా కూటమిని ఏకం చేస్తాం: అఖిలేష్ యాదవ్

Gaddamidi Naveen
14 డిసెంబర్, 2025

ఇండియా కూటమిని మరింత బలోపేతం చేస్తామని, కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఎదురైన పరాజయాన్ని ప్రస్తావించినా, కాంగ్రెస్‌తో ఎస్పీ పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టంగా ప్రకటించారు.

శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన అఖిలేష్ యాదవ్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇండియా కూటమిపై “పగుళ్లు వచ్చాయి” అంటూ ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. అలాంటి ప్రచారాలకు తావులేదని, కూటమిని కొనసాగిస్తూ అందరినీ కలుపుకుపోయేలా పనిచేస్తామని ఆయన చెప్పారు. బిహార్‌లో అనుభవం అంత మంచిగా లేకపోవచ్చు. కానీ ఇండియా కూటమిని మేమే ముందుకు నడిపిస్తాం. భాగస్వామ్య పార్టీలన్నింటినీ కలిపేందుకు కృషి చేస్తాం అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంట్‌సివ్ రివిజన్ –స‌ర్) పేరుతో బీజేపీ ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల డేటాను అప్‌లోడ్ చేయడానికి ఉపయోగిస్తున్న ఒక ‘మ్యాపింగ్ యాప్’ ద్వారా సుమారు మూడు కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ యాప్‌లో నమోదవుతున్న డేటా, వాస్తవంగా ఉన్న ఎన్నికల సమాచారంతో పొంతన లేకుండా ఉందని అన్నారు. ఆ మ్యాపింగ్ యాప్‌ను అభివృద్ధి చేసిన సంస్థే గతంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థ అని ఆరోపిస్తూ, డేటా ఎక్కడికి వెళ్తోంది? ఎవరి చేతుల్లోకి చేరుతోంది? అని ప్రశ్నించారు. బీజేపీ ఓడిన ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపుకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో కూడా సమాజ్‌వాది పార్టీ లేవనెత్తిందని గుర్తుచేశారు.

ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో వ్యవహరిస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఇది ఎస్ఐఆర్ కాదు. నేరుగా ఎన్ఆర్సీ అమలు చేయలేక, అదే పని ఇప్పుడు ఎస్ఐఆర్ రూపంలో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్ఆర్సీని అమలు చేసి, దాని ద్వారా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై దృష్టి పెట్టకుండా, సాంకేతికతను ఉపయోగించి ఓటింగ్ శాతం పెంచే దిశగా ఎన్నికల సంఘం ఆలోచించాలని ఆయన సూచించారు. ఆధార్‌ను మరింత పక్కాగా తయారు చేయాల్సిన అవసరం ఉందని, అయితే ఆధార్‌ను ఓటర్ల జాబితాతో ఎందుకు లింక్ చేయడం లేదని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఎస్పీ సిద్ధతలపై ప్రశ్నించగా, బీజేపీని ఓడించడానికి మేము ఏఐ (కృత్రిమ మేధస్సు)ను కూడా ఉపయోగిస్తాం అంటూ హాస్యంగా స్పందించారు. ఎస్పీ అధికారంలోకి వస్తే, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.విజన్ ఇండియా ఏఐ సమిట్’కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేష్ యాదవ్, సదస్సులో మాట్లాడుతూ ఏఐని సానుకూల, ప్రగతిశీల ప్రయోజనాల కోసం అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా వినియోగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇండియా కూటమిని ఏకం చేస్తాం: అఖిలేష్ యాదవ్ - Tholi Paluku