
‘ఇండియా ఓపెన్’ పురుషుల సింగిల్స్ టైటిల్ లిన్ చున్–యీకి సొంతం
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో చైనా తైపే ఆటగాడు లిన్ చున్–యీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకోగా, దక్షిణ కొరియా ప్రపంచ నంబర్ వన్ ఆన్ సె యంగ్ మహిళల సింగిల్స్ కిరీటాన్ని గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. 26 ఏళ్ల లిన్ చున్–యీ, ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉండగా, పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీని 21–10, 21–18 తేడాతో ఓడించి తన తొలి సూపర్ 750 టైటిల్‌ను సాధించాడు. గత వారం మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన లిన్, ఈ విజయంతో అద్భుతమైన పునరాగమనాన్ని నమోదు చేశాడు.
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆన్ సె యంగ్, చైనా ప్రపంచ నంబర్ టూ వాంగ్ జియీపై 21–13, 21–11తో ఘన విజయం సాధించి ఈ సీజన్‌లో తన రెండో టైటిల్‌ను గెలుచుకుంది.
డబుల్స్ విభాగంలో, చైనా టాప్ సీడ్ మహిళల జోడీ లియు షెంగ్షు – టాన్ నింగ్ జపాన్ జంట యుకి ఫుకుషిమా – సయాకా మాట్సుమోటోపై 21–11, 21–18తో విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో థాయిలాండ్‌కు చెందిన మూడో సీడ్ జంట డెచపోల్ పువారనుక్రోహ్ – సుపిసారా పేవ్‌సాంప్రాన్, డెన్మార్క్ జోడీని 19–21, 25–23, 21–18తో ఓడించి కిరీటాన్ని గెలుచుకుంది.
లిన్ వర్సెస్ జొనాథన్
చైనా మాస్టర్స్ టోర్నీలో గతంలో సూపర్ 750 టైటిల్‌కు చేరువైన లిన్ చున్–యీ, కౌలలంపూర్‌లో మసిల్ స్ట్రెయిన్‌తో బాధపడుతూ భారత్‌కు వచ్చాడు. నడవడానికే ఇబ్బంది ఉన్నప్పటికీ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకుని ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎడమచేతి ఆటగాడు అయిన లిన్ వేగవంతమైన ఆటతో జొనాథన్ ను ఇబ్బంది పెట్టాడు. హాల్‌లోని గాలి దిశను సరిగా అంచనా వేయలేకపోయిన జొనాథన్ వరుసగా తప్పిదాలు చేయడంతో లిన్ తొలి గేమ్‌ను ఏకపక్షంగా దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో జొనాథన్ కొంత పోరాటం చేసినప్పటికీ చివరి దశలో లిన్ వరుసగా ఆరు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను ముగించాడు. ఈరోజు నేను చాలా బాగా ఆడాను. ఎలాంటి ఒత్తిడి అనిపించలేదు. ఆనందంగా ఆటను ఆస్వాదించాను అని లిన్ అన్నాడు.
మలేషియాలో నాకు అంతగా సౌకర్యంగా అనిపించలేదు. కానీ భారత్‌లో కోర్ట్‌పై స్వేచ్ఛగా ఆడగలిగాను అని చెప్పాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన లిన్, ఈ విజయం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని తెలిపారు. ఈ ఏడాది టాప్–10లోకి రావడమే నా లక్ష్యం. గెలిచినా, ఓడినా పట్టుదలే ముఖ్యమైనదని వ్యాఖ్యానించాడు. ఖాళీ సమయాల్లో వీడియో గేమ్స్ ఆడటం తనకు ఇష్టమని కూడా తెలిపాడు.
ఆన్ సె యంగ్ వర్సెస్ వాంగ్ జియీ
మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. వాంగ్ జియీతో ఇప్పటివరకు జరిగిన 22 మ్యాచ్‌లలో ఇది ఆమెకు 18వ విజయం. 2025లో ఇద్దరి మధ్య జరిగిన తొమ్మిది ఫైనల్స్‌లోనూ ఆన్ సె యంగ్ విజయం సాధించింది. కోర్ట్ అంతటా వేగంగా కదులుతూ, ఖచ్చితమైన షాట్లతో వాంగ్‌ను వెనక్కి నెట్టిన ఆన్, తొలి గేమ్‌ను సులభంగా గెలుచుకుంది. రెండో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించడంతో మ్యాచ్ త్వరగానే ముగిసింది. గెలవడం చాలా ఆనందంగా ఉంది. గత రెండు వారాలు చాలా అలసటగా గడిచాయి. కానీ నేను విజేతనని ఆన్ సె యంగ్ చెప్పారు. ప్రతి ఆటగాడు నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాడు. నేను కూడా ఓడిపోకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను అని ఆమె అన్నారు.
దక్షిణ కొరియా సింగిల్స్ కోచ్ హ్యూనిల్ లీ మాట్లాడుతూ, ఆన్ సె యంగ్ తన ఆటను మరింత దాడి తత్వంతో మలుచుకోవడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిందన్నారు. శారీరక బలం, మానసిక దృఢత్వం పెంచుకునేందుకు ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందని తెలిపారు.
