
ఇండియాదే సీరీస్
ఓటమితో ప్రారంభమైన సిరీస్ చివరికి భారత్ ఆధిపత్యంతో ముగిసింది. సీరీస్ లో వర్షం అంతరాయం కలిగించినా, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని యువభారత్ తన ప్రతిభను మళ్లీ నిరూపించింది. బలమైన ఆస్ట్రేలియాపై సిరీస్‌ను 2–1 తేడాతో కైవసం చేసుకుని టీ20 ప్రపంచకప్‌కు ముందస్తు ‘వార్మ్‌అప్’ ఇచ్చినట్టైంది. రెండు మ్యాచ్ లు వర్షార్పణం అయ్యాయి. అందరూ కలిసికట్టుగా ప్రదర్శన కనబరిచి సీరీస్ ను నిలబెట్టారు. అయితే ఈ సీరీస్ లో ఐదు మ్యాచ్ లు ఎలా సాగాయంటే
మొదటి మ్యాచ్ – వర్షం వల్ల రద్దు (క్యాంబెరా)
సిరీస్ ప్రారంభం వర్షంతోనే మొదలైంది. క్యాంబెరాలో తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా ఆడకుండానే రద్దయింది. వాతావరణం అంతరాయం కలిగించినా, అభిమానుల్లో ఉత్కంఠ మాత్రం తగ్గలేదు.
ఆస్ట్రేలియాకు తొలి దెబ్బ (సిడ్నీ)
సిడ్నీలో జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ తడబాటుతో 167 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ (42), తిలక్ వర్మ (38) కాస్త ప్రదర్శన చూపారు. కానీ భారీ స్కోరు చేయలేకపోయారు. ఆస్ట్రేలియా నుంచి గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ జంటగా చెలరేగి లక్ష్యాన్ని సులువుగా చేధించారు. దీంతో భారత్ 0–1తో వెనుకబడింది.
బుమ్రా బౌలింగ్ బుల్లెట్ (అడిలైడ్)
అడిలైడ్ లో జరిగిన మూడో మ్యాచ్ లో సూర్య సైన్యం తిరిగి పుంజుకుంది. బుమ్రా తన పేస్, ఖచ్చితత్వంతో ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బుమ్రాకు అర్షదీప్ కూడా తోడయ్యాడు. బ్యాటింగ్‌లో గిల్ (63)–అభిషేక్ (47) జంట చెలరేగి 180 స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 145కే కుప్పకూలింది. ఇందులో భారత్ ఘనవిజయం సాధించింది.
అక్సర్, వరుణ్ మ్యాజిక్ (పెర్త్)
నాలుగో మ్యాచ్ లో స్పిన్నర్ల మాయజలం మైమరపించింది. అక్సర్ పటేల్, వరుణ్ ఆస్ట్రేలియా జట్టును కుప్పకూల్చారు. ఇందులో విజయంతో భారత్ సీరీస్ లో ముందడుగు వేసింది. బౌలర్ల ఆత్మవిశ్వాసం అద్భుతం. అక్సర్ పటేల్ తన లైన్, లెంగ్త్‌తో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ ను చిత్తు చేశాడు (3/21). వరుణ్ చక్రవర్తి కీలకమైన మార్ష్, స్టాయినిస్ వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. బ్యాటింగ్‌లో సూర్య (51) తిలక్ (36) అద్భుతంగా ఆడారు. భారత్ సిరీస్‌లో 2–1 ఆధిక్యం సాధించింది.
గబ్బా మ్యాచ్ వర్షార్పణం
భారత్ 4.5 ఓవర్లలోనే 52 పరుగులు చేసింది. గిల్ (29), అభిషేక్ (23) చెలరేగుతున్న వేళ ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం ఆటకు అడ్డంకిగా మారింది.దీంతో మ్యాచ్ రద్దయ్యింది. దీంతో భారత్ సిరీస్ విజేతగా నిలిచింది.
సిరీస్ హైలైట్స్
• శుభ్‌మన్ గిల్
మూడు మ్యాచ్‌లలో 150+ పరుగులు, పవర్‌ప్లేలో అద్భుతమైన దూకుడు కనబరిచాడు.
• అక్సర్ పటేల్
బౌలింగ్‌లో 6 వికెట్లు, ఫీల్డింగ్‌లో కీలక రన్ అవుట్
• జస్ప్రిత్ బుమ్రా 7 వికెట్లు తీసీ, కేవలం 5.8 ఎకానమీ రేట్
• అభిషేక్ శర్మ
అగ్రశ్రేణి ఓపెనర్‌గా స్థిరమవుతున్న సూచనలు ఇచ్చాడు.
• సూర్యకుమార్ యాదవ్
2 అర్ధశతకాలు, వ్యూహాత్మక నాయకత్వం వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.
సూర్య సైన్యం ఎలా గెలిచింది?
• తొలి ఓటమి తర్వాత గేరు మార్చింది — వాషింగ్టన్ సుందర్, వరుణ్ జట్టులో చేరడం.
• బుమ్రా, అర్షదీప్ లెఫ్ట్–రైట్ కాంబోతో దెబ్బతీశారు.
• తిలక్ వర్మా, సూర్య రన్ రేట్ నిలిపారు.
• స్పిన్నర్లు డెత్ ఓవర్లలో కూడా కంట్రోల్ చూపారు.
0–1 వెనుకబడి కూడా తిరిగి పుంజుకోవడం గొప్ప విషయం. ప్రతి ఆటగాడు తన పాత్ర చక్కగా పోషించాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇది పెద్ద మోరల్ బూస్ట్ అని కప్టెన్ సూర్య కుమార్ తెలిపారు. ఇకపై భారత్ దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్‌లతో సిరీస్‌లు ఆడనుంది. ప్రపంచకప్‌కు ముందు ఇది ‘ఫైనల్ టెస్టింగ్ గ్రౌండ్’. మహిళల జట్టు దేశంలో ప్రపంచకప్ గెలిచినప్పుడు అభిమానుల నుంచి వచ్చిన మద్దతు చూసి ఎంతో స్ఫూర్తి కలిగింది. మేం కూడా ఆ స్థాయిలో ఆడతాం. స్వదేశంలో ఆడటం అంటే ఒత్తిడి, కానీ అదే సమయంలో ఉత్సాహం, బాధ్యతా ఉంటుంది అని సూర్య అన్నారు.
తాజా మ్యాచ్ వివరాలు
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ భారత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (29), అభిషేక్ శర్మ (23) కేవలం 4.5 ఓవర్లలో 52 పరుగులు రాబట్టి దూసుకెళ్లారు. అనంతరం వర్షం కారణంగా ఆట నిలిచిపోయి చివరికి రద్దయింది.
