Let's talk: editor@tmv.in
ఇండియన్ సూపర్‌క్రాస్ ఛాంపియన్‌గా బాసిల్ సన్నీ

ఇండియన్ సూపర్‌క్రాస్ ఛాంపియన్‌గా బాసిల్ సన్నీ

Shaik Mohammad Shaffee
10 ఫిబ్రవరి, 2026

అంకితభావం, పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చని ఎర్నాకులం రైడర్ బాసిల్ సన్నీ నిరూపించారు. విశాఖలోని జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగిన 'ఎంఆర్‌ఎఫ్ మొగ్రిప్ ఎఫ్‌ఎంఎస్‌సీఐ' ఇండియన్ నేషనల్ సూపర్‌క్రాస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బాసిల్ సన్నీ తన తొలి జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చిరిగిన లిగమెంట్, విరిగిన కాలి వేలితో తీవ్రమైన నొప్పిని భరిస్తూనే రేసింగ్‌ను పూర్తి చేసి విజేతగా నిలిచారు.

నొప్పిని మించిన పట్టుదల

ఈ సీజన్ అంతటా బాసిల్ సన్నీ అద్భుతమైన నిలకడను ప్రదర్శించారు. ఆరు రౌండ్లలో ఒక్క 'మోటో' కూడా గెలవకపోయినప్పటికీ, ప్రతి రేసులోనూ అగ్రస్థానాల్లో నిలవడం ఆయనకు కలిసివచ్చింది. "తీవ్రమైన గాయం కారణంగా గత 15 రోజులుగా చికిత్సను వాయిదా వేసుకున్నాను. ఈ ఫైనల్ రౌండ్ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది" అని సన్నీ ఉద్వేగంతో చెప్పారు.

రుగ్వేద్ ‘ఆరో’ సంచలనం

ప్రీమియర్ ఎస్ఎక్స్1 విభాగంలో పుణెకు చెందిన రుగ్వేద్ బార్గుజే మరోసారి తన ఆధిపత్యాన్ని చాటారు. తన అనుభవంతో రేసును నియంత్రించిన రుగ్వేద్, కెరీర్‌లో ఆరో జాతీయ టైటిల్‌ను ముద్దాడారు. టీవీఎస్ రైడర్ ప్రజ్వల్ విశ్వనాథ్ 'రైడర్ ఆఫ్ ది డే'గా నిలిచినప్పటికీ, ఓవరాల్ పాయింట్లలో రుగ్వేద్ అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్‌గా ఆవిర్భవించారు.

వైజాగ్‌లో సరికొత్త చరిత్ర

ఏపీలోని విశాఖపట్నంలో తొలిసారిగా ఎఫ్‌ఎంఎస్‌సీఐ ఆధ్వర్యంలో జాతీయ మోటార్ స్పోర్ట్ ఈవెంట్‌ నిర్వహించడం ఒక మైలురాయిగా నిలిచింది. గాడ్‌స్పీడ్ రేసింగ్ ప్రమోట్ చేసిన ఈ ఛాంపియన్‌షిప్‌ను ఆర్ఆర్ఆర్ మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్, రిషి బృందం అత్యంత వృత్తిపరంగా నిర్వహించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన క్రీడాభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది.

ఇతర విభాగాల్లో విజేతలు వీరే..

ఇతర విభాగాల్లోనూ రైడర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. నోవిస్ కేటగిరీలో కోయంబత్తూరుకు చెందిన టీవీఎస్ రేసింగ్ రైడర్ శైలేష్ కుమార్ జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకోగా, ఇండియన్ ఎక్స్‌పర్ట్స్ క్లాస్‌లో షిల్లాంగ్‌కు చెందిన బంటేలాంగ్ జిర్వా సీజన్ అంతటా తన ఆధిపత్యాన్ని చాటి ఛాంపియన్‌గా నిలిచారు. ప్రైవేట్ ఎక్స్‌పర్ట్స్ విభాగంలో కోయంబత్తూరుకే చెందిన అభి ఎస్ నాథ్ విజేతగా ఆవిర్భవించారు. జూనియర్ విభాగాల్లో జినేంద్ర సాంగవే (జూనియర్ ఎస్ఎక్స్1), చైతన్య జోషి (85సీసీ జూనియర్ ఎస్ఎక్స్2) తమ అద్భుత నైపుణ్యంతో టైటిళ్లను గెలవగా, అత్యంత పిన్న వయస్కుల విభాగమైన జూనియర్ ఎస్ఎక్స్3లో బెంగళూరుకు చెందిన విస్మయ్ రామ్ వై జాతీయ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు.