
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఆయన అభ్యర్థన మేరకు నోటీస్ పీరియడ్‌ను కూడా కంపెనీ మాఫీ చేసి వెంటనే పదవి నుంచి తప్పించింది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ విడుదల చేసిన ప్రకటనలో ఎల్బర్స్ సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తు కార్యాచరణకు శుభాకాంక్షలు తెలిపింది. 2022 సెప్టెంబర్ 6 నుంచి ఇండిగో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్బర్స్ రాజీనామా ఆకస్మికంగా చేయడం గమనార్హం. కొత్త సీఈఓ నియామకం వరకు సంస్థ వ్యవహారాలను సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా చూసుకుంటారని సంస్థ తెలిపింది. త్వరలోనే కొత్త నాయకుడిని నియమిస్తామని పేర్కొంది. గత డిసెంబర్ 3 నుంచి 5 మధ్య ఇండిగోలో భారీ స్థాయిలో ఆపరేషనల్ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో దేశవ్యాప్తంగా 2,507 విమానాలు రద్దు కాగా, 1,852 విమానాలు ఆలస్యమయ్యాయి. దీంతో మూడు లక్షలకుపైగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ జనవరిలో ఇండిగోపై రూ.22.20 కోట్ల జరిమానా విధించింది. అంతేకాకుండా భవిష్యత్తులో వ్యవస్థాపరమైన లోపాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. తన రాజీనామా లేఖలో ఎల్బర్స్ మాట్లాడుతూ ఇండిగో కుటుంబంలో భాగంగా పని చేయడం గౌరవంగా భావిస్తున్నానని, సంస్థ అభివృద్ధి కథలో భాగస్వామి కావడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. అవసరమైతే బాధ్యతల బదిలీ ప్రక్రియలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలిపారు. ఇండిగోను 22 సంవత్సరాలుగా నిర్మించి అభివృద్ధి చేసిన సంస్థగా భావిస్తున్నానని రాహుల్ భాటియా పేర్కొన్నారు. ప్రయాణికులకు నమ్మకమైన సేవలు అందిస్తూ సంస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
