
ఇండిగో విమానాలు 5 శాతం తగ్గించాలి: డీజీసీఏ
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు భారత విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ షాకిచ్చింది. ఈ శీతాకాలంలో అధిక డిమాండ్ ఉన్న రూట్లలో ఇండిగో షెడ్యూల్ చేసిన విమానాల సంఖ్యను 5 శాతం తగ్గించాలని ఆదేశించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా సరైన ప్రణాళిక చేయకపోవడంతో వేలాది విమానాలు రద్దు కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.డిసెంబర్ 8న జారీ చేసిన ఆదేశంలో డీజీసీఏ బుధవారం లోపు సవరించిన షెడ్యూల్‌ను సమర్పించాలని ఇండిగోను ఆదేశించింది. 2025-26 శీతాకాల షెడ్యూల్‌లో ఇండిగో రోజుకు 2,200కు పైగా విమానాలను నడిపిస్తోంది. కానీ డిసెంబర్ 2 నుంచి ఇప్పటివరకు 4,000కు పైగా విమానాలను రద్దు చేయడంతో లక్షలాది ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయాల్లో అల్లకల్లోలం నెలకొంది. దీనిపై డీజీసీఏ ఇండిగో సీఈవో, సీవోవోలకు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. అలాగే నలుగురు సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి లోపాలపై దర్యాప్తు ప్రారంభించింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ శీతాకాలంలో 9.66 శాతం, వేసవి షెడ్యూల్‌తో పోలిస్తే 6.05 శాతం ఎక్కువ విమానాలను నడపాలని ఇండిగో ప్లాన్ చేసుకుంది. కానీ ఈ షెడ్యూల్‌ను సమర్థవంతంగా నడపగల సామర్యం చూపలేదంటూ డీజీసీఏ తన ఆదేశంలో పేర్కొంది. కాబట్టి అన్ని రూట్లలో, ముఖ్యంగా హై-డిమాండ్, హై-ఫ్రీక్వెన్సీ రూట్లలో 5 శాతం విమానాలు తగ్గించాలి. ఒక్క రూట్‌లో ఒక్క విమానం మాత్రమే నడిపే పరిస్థితి రాకూడదని స్పష్టంగా ఆదేశించింది.
సాధారణ స్థితికి వచ్చింది
లోక్‌సభలో పౌర విమానయాన శాఖ మంత్రి రాం మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినా, ప్రణాళికా లోపాలు, నిబంధనల ఉల్లంఘనల ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడానికి అనుమతించబోం. కఠినమైన, తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇండిగో లో సిబ్బంది రోస్టరింగ్ లోపాల వల్లే ఈ అంతరాయం జరిగిందని, ఇప్పుడు విమానాల షెడ్యూల్ సాధారణ స్థితికి చేరుకుంటోందని, మిగతా విమానయాన సంస్థలన్నీ సాధారణంగానే నడుస్తున్నాయని మంత్రి తెలిపారు.
రద్దైన విమానాలకు వెంటనే రీఫండ్ ఇవ్వాలని ఆదేశించాం. ఇప్పటివరకు రూ.750 కోట్లకు పైగా ప్రయాణికుల ఖాతాల్లో జమ అయ్యాయి. విమానాశ్రయాల్లో ఎలాంటి జన సమూహాలు, ఇబ్బందులు లేవని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఇండిగో అతి దూకుడు షెడ్యూల్, రాత్రిపూట గరిష్ఠ వినియోగం వంటి వ్యూహాలతో దూసుకెళ్లింది. కానీ నవంబర్ 1 నుంచి పైలట్లకు వారానికి ఎక్కువ విశ్రాంతి, రాత్రి ల్యాండింగ్‌లు-డ్యూటీ గంటలపై కొత్త కఠిన నియమాలు అమల్లోకి వచ్చాక ఆ వ్యూహం దెబ్బతింది. ఫలితంగా ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ దిగజారి, రోజుకు వందలాది విమానాలు రద్దయ్యాయి.
ఈ ఇబ్బందిని ఇండిగో విమానయాన వ్యవస్థలో రద్దీ, కొత్త పైలట్ రెస్ట్ రూల్స్, సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణం అని కారణాలుగా చెబుతోంది. ఈ వారంలోపు పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భరోసా ఇస్తోంది. మరోవైపు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) షేర్లు మంగళవారం 2 శాతం పడిపోయాయి. ఈ నెలలోనే 17 శాతానికి పైగా నష్టపోయాయి.
ప్రయాణికులకు క్షమాపణలు తెలిపిన సీఈవో పీటర్ ఎల్బర్స్
దేశవ్యాప్తంగా విమానాల రద్దులతో విమానాశ్రయాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను ఒక వారం తర్వాత ఇండిగో మళ్లీ నెట్వర్క్‌ను చక్కబరిచినట్లు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంస్థ తరఫున క్షమాపణలు తెలిపారు.మేం మిమ్మల్ని నిరాశపర్చాం. మీ ప్రయాణాలు, భావాలు, ఆశలు అన్నింటినీ మేము అర్థం చేసుకుంటాం. ఈ గందరగోళం కారణంగా మీరు పడిన ఇబ్బందులకు నిజంగా చింతిస్తున్నామని అన్నారు.
ముందుగా నిలిచిపోయిన ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చామని, ప్రయాణికులకు పూర్తి రీఫండ్‌లు అందజేశామని, సామాను కూడా వారికి అందిచామన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరగా అందజేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని వివరించారు. విమానాల సంఖ్యను పెంచి కార్యకలాపాలను వేగంగా పునరుద్ధరించినట్లు చెప్పారు. డిసెంబర్ 10-15 మధ్య సాధారణ స్థితి వస్తుందని ముందుగా చెప్పాం. కానీ ఇప్పటికే పూర్తిగా కార్యకలాపాలు స్థిరపడ్డాయన్నారు. ప్రయాణికుల నుంచి మళ్లీ బుకింగ్స్ రావడం ధైర్యం ఇచ్చిందని కూడా ఎల్బర్స్ చెప్పుకొచ్చారు.
తగ్గనున్న విమాన సర్వీసులు
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఇండిగో ప్రస్తుతం రోజుకు సుమారు 2,200-2,700 విమాన సర్వీసులు నడుపుతోంది. ఇందులో దేశీయ (డొమెస్టిక్) అంతర్జాతీయ (ఇంటర్నేషనల్) రూట్లు ఉన్నాయి. డీజీసీఏ ఆదేశాల మేరకు విమానాల సంఖ్యను 5శాతం తగ్గించాలని ఆదేశించింది. ఫలితంగా ప్రస్తుతం రోజుకు 1,800-1,900 సర్వీసులు మాత్రమే నడుపుతున్నారు. ఈ క్రైసిస్ త్వరలో ముగిసి షెడ్యూల్ స్థిరపడుతుందని ఇండిగో భరోసా ఇస్తోంది.
