
ఇండక్షన్ స్టవ్‌లకు మారితే విద్యుత్ సబ్సిడీ: సీఎం స్టాలిన్
హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల బదులు ఇండక్షన్ స్టవ్‌లు ఉపయోగిస్తే యూనిట్‌కు రూ.2 విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఘర్షణల కారణంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఇండక్షన్ స్టవ్‌లు ఉపయోగించే హోటళ్లు, టీ షాపులు, క్లౌడ్ కిచెన్లకు అదనంగా వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు కొనసాగుతున్నంతకాలం అమల్లో ఉంటుందని అదనపు ప్రధాన కార్యదర్శి జే.రాధాకృష్ణన్ తెలిపారు. ఇటీవలి రోజుల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, సాధారణ వినియోగంతో పోలిస్తే సుమారు 50 మెగావాట్ల అదనపు డిమాండ్ నమోదైందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో తమిళనాడు పొల్యూషన్ బోర్టు అనుమతితో నడుస్తున్న 60,698 పరిశ్రమలు ఇకపై ప్రత్యామ్నాయ ఇంధనాలైన కిరోసిన్ వంటి వాటిని వినియోగించేందుకు అదనపు సర్టిఫికెట్ అవసరం లేదని తెలిపారు. వారు బోర్డుకు సమాచారం ఇవ్వడం మాత్రమే సరిపోతుందని చెప్పారు. ఈ సడలింపు ప్రభుత్వం విధించిన పరిమితులు ముగిసే వరకు అమల్లో ఉంటుంది. కమర్షియల్ ఎల్పీజీ సరఫరాలో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య సంస్థలకు ఎల్పీజీ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మరో కమిటీ పనిచేసి స్థానిక పరిస్థితులను పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు.
స్టవ్‌ల కొనుగోలుకు రుణాలు
కమర్షియల్ ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇండక్షన్ స్టవ్‌లు, హీటర్ల వంటి విద్యుత్ పరికరాల కొనుగోలుకు అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ పథకంలో 25 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.3.75 లక్షలు) ఇస్తారు. అలాగే మహిళా వ్యాపారులకు తమిళనాడు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్‌మెంట్ స్కీం కింద రూ.10 లక్షల వరకు రుణాలపై 25 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.2 లక్షలు) ఇవ్వబడుతుందని చెప్పారు. రెస్టారెంట్లలో డిమాండ్ తగ్గడంతో రైతుల కూరగాయల విక్రయాలు ప్రభావితంకాకుండా ఉండేందుకు రైతులు రాష్ట్రంలోని 194 ఉజవర్ సందాయి రైతు బజార్లలో ఎలాంటి పరిమితులు లేకుండా ఉత్పత్తులు విక్రయించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అదనంగా, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ కార్డు దారులకు ఈ నెలలో అదనంగా 3,228 కిలోలీటర్ల కిరోసిన్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
