Let's talk: editor@tmv.in
ఇంట్లోకి చొరబడి దుండగుల హల్ చల్

ఇంట్లోకి చొరబడి దుండగుల హల్ చల్

Panthagani Anusha
17 అక్టోబర్, 2025

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దారుణ దోపిడీ ఘటన గ్రామస్థుల్లో భయాందోళనకు గురిచేసింది. కాగా గుర్తుతెలియని దుండగులు ఇద్దరు రైతుల ఇళ్లలోకి చొరబడి, విలువైన ఆభరణాలు, నగదు దోచుకోవడమే కాకుండా ఇంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన ఆష్టీ తాలూకా పరిధిలోని ఆరణ్విహిరా గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.

ఉదయం వేళ దొంగల దాడి

స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం, రైతులు నవనాథ్ జాధవ్, రావుసాహెబ్ జాధవ్ ఇళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకుని వారి మూడు తులాల బంగారం, రూ.13,000 నగదును దోచుకెళ్లారు. ఈ దోపిడీ సమయంలో దుండగులు ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులపై క్రూరంగా దాడికి పాల్పడ్డారు.

వృద్ధురాలికి తీవ్రమైన గాయాలు

దాడిలో నవనాథ్ జాధవ్ భార్య శేవుబాయికి తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు ఆమె చెవిపోగులను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించిన క్రమంలో చెవికి తీవ్ర గాయం అయింది. పరిస్థితిని గమనించిన స్థానికులు గాయపడిన జాధవ్ దంపతులను అహిల్యానగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం, వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ వారు మానసికంగా భయాందోళనలో గురైనట్లు పేర్కొన్నారు.

మరోవైపు స్థానిక సమాచారం మేరకు అంబోరా పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ మంగేష్ సాల్వే మాట్లాడుతూ దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ సేకరణ, అనుమానితుల విచారణ చేపట్టాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం అని తెలిపారు.

పులుల దాడులు మధ్య మరో బెదిరింపు

ఇక గ్రామ సర్పంచ్ అన్నసాహెబ్ శిర్సత్ స్పందిస్తూ ఇప్పటికే చిరుత పులుల దాడులతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పుడు దోపిడీలు జరగడం మరింత భయానక పరిణామం. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా దుండగులను పెట్టుకోవాలంటూ అయన డిమాండ్ చేశారు.

ఇంట్లోకి చొరబడి దుండగుల హల్ చల్ - Tholi Paluku