Let's talk: editor@tmv.in
ఇంటెల్‌తో కలిసి ఇండియా ఏఐ మిషన్‌ గిన్నిస్‌ రికార్డు

ఇంటెల్‌తో కలిసి ఇండియా ఏఐ మిషన్‌ గిన్నిస్‌ రికార్డు

Shaik Mohammad Shaffee
19 ఫిబ్రవరి, 2026

కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో నైతికత, బాధ్యతను చాటడంలో భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న 'భారత్‌ ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026' వేదికగా దేశం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును కైవసం చేసుకుంది. "ఏఐ బాధ్యతాయుత ప్రచారానికి 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో ప్రతిజ్ఞలు స్వీకరించిన దేశం"గా భారత్‌ రికార్డు నెలకొల్పినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుంచి 17 మధ్య కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 2,50,946 మంది పౌరులు తమ ఆమోదాన్ని తెలియజేస్తూ ఈ చారిత్రక ఘనతలో భాగస్వాములయ్యారు.

యువత భాగస్వామ్యం.. నైతికతే పునాది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా 'ఇండియా ఏఐ మిషన్', 'ఇంటెల్‌ ఇండియా' సంయుక్త ఆధ్వర్యంలో ఈ వినూత్న ప్రచారాన్ని చేపట్టారు. ఏఐ సాంకేతికతను కేవలం వాడటమే కాకుండా.. దానిని నైతికతతో, సమ్మిళితంగా, బాధ్యతాయుతంగా వినియోగించేలా పౌరులను చైతన్యపరచడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విద్యా సంస్థల ద్వారా విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక పోర్టల్ (aipledge.indiaai.gov.in) ద్వారా ఈ సేకరణ చేపట్టారు. కేవలం 5,000 ప్రతిజ్ఞలే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రచారానికి.. అనూహ్యంగా రెండున్నర లక్షల మంది స్పందించడం విశేషం.

ప్రతిజ్ఞలో ముఖ్యాంశాలు.. డిజిటల్ బ్యాడ్జీలు

ఈ ప్రతిజ్ఞ కేవలం సంతకం, క్లిక్ చేయడం మాత్రమే కాకుండా.. పాల్గొన్న పౌరులు డేటా గోప్యత, జవాబుదారీతనం, పారదర్శకత, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై అవగాహన పెంచుకునేలా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన వారికి ప్రత్యేక 'డిజిటల్ బ్యాడ్జీ'తో పాటు ఏఐ లెర్నింగ్ పాత్‌వేస్‌లో ప్రవేశాన్ని కల్పించారు. ఈ విజయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ప్రవీణ్ పటేల్ అధికారికంగా ధ్రువీకరించారు.

భవిష్యత్తు దిశగా అడుగులు

మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌.. ఈ రికార్డు దేశ యువతలో పెరుగుతున్న సామాజిక స్పృహకు నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. ఏఐని సమాజ హితం కోసం, జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఒక సాధనంగా మాత్రమే చూడాలని, అదే సమయంలో బాధ్యతను మరవకూడదని ఆయన పిలుపునిచ్చారు. 2.5 లక్షల మంది విద్యార్థులు చూపిన ఈ చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేశం ఏఐ భవిష్యత్తు వైపు కేవలం సాంకేతికంగానే కాకుండా, నైతిక విలువలతో కూడిన దిశలో పయనిస్తోందని ఈ రికార్డు రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెయిటీ కార్యదర్శి ఎస్.కృష్ణన్, ఇండియా ఏఐ సీఈఓ అభిషేక్ సింగ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.