
ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్ గా ఏపీ.. రూ.50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం: సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అపారంగా లభ్యమవుతున్న బీచ్ సాండ్ వంటి అరుదైన ఖనిజాలను సమర్థంగా వినియోగించుకోవాలని తద్వారా పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త బాటలు వేయాలని ఆయన సూచించారు. మంగళవారం సచివాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ రూపకల్పనపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే పదేళ్ల కాలంలో ఈ మిషన్ ద్వారా రాష్ట్రానికి రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సుమారు 40,000 మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. అరుదైన ఖనిజాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను వాల్యూ ఎడిషన్ (విలువల జోడింపు) పద్ధతులను నిశితంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర తీర ప్రాంతంలో లభించే బీచ్ సాండ్ మినరల్స్ దేశంలోనే అత్యంత విలువైనవని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని ఈ ఉత్పత్తులు కేవలం పెయింట్స్, కాస్మెటిక్స్, ఔషధ రంగాలకే కాకుండా రక్షణ రంగం, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం, అణు రియాక్టర్ల విడిభాగాల తయారీ వంటి కీలక పరిశ్రమలకు వెన్నెముకగా నిలుస్తాయని వెల్లడించారు.
కాగా ఈ వనరులను పారిశ్రామికంగా మలచుకునేందుకు రాష్ట్రంలో మూడు భారీ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. శ్రీకాకుళంలో ఏటా 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ‘టైటానియం పార్క్’ అనకాపల్లిలో ఏటా 25 వేల టన్నుల సామర్థ్యంతో ‘రేర్ ఎర్త్ కారిడార్’ మచిలీపట్నంలో ‘సమగ్ర టైటానియం, రేర్ ఎర్త్ కారిడార్’ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
