Let's talk: editor@tmv.in
ఇంటింటికీ 'బాకీ కార్డు' పంచిన బీఆర్ఎస్

ఇంటింటికీ 'బాకీ కార్డు' పంచిన బీఆర్ఎస్

Gaddamidi Naveen
29 సెప్టెంబర్, 2025

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట, సమత కాలనీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఇంటింటికీ తిరిగి “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంచుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్ర‌చారంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలతో కలిసి పర్యటించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు గుర్తు చేస్తూ, వచ్చే ఉపఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మాయ మాటలకు బలైపోయ‌ర‌ని, బకాయిల గుర్తు కోసం ఈ ఉద్యమం ప్రారంభించామని అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ పాలనను మరిచి, అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని వంచించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనను గురించి తెలిపారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంప దెబ్బ‌ లాంటి సమాధానం ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్‌ను కలవడానికి యువత భారీగా తరలివచ్చారు. అరచేతిలో స్వ‌ర్గం చూపించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పి 700 రోజుల్తెనా ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌ని విమ‌ర్శించారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామ‌ని చెప్పి ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ.55,000 బకాయిలు పెరిగాయన్నారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ హామీ కూడా అమలుకాక, ఒక్కొక్కరికి రూ.44,000 వరకు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేకపోయినా, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. పర్యటన సందర్భంగా స్థానికులు తమ సమస్యలను కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. నగరంలో పారిశుద్ధ్యం లేదు, మురుగు నీరు నిలుస్తోంది, కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి అంటూ తమ బాధలు తెలిపారు. వాటిపై స్పందించిన కేటీఆర్, ఈ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేస్తూ, ప్రజలు ఆమెను గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఇదే అని అన్నారు. అలాగే స్థానిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు మ‌ద్ధ‌తు ఇవ్వాలని ప్ర‌జ‌ల‌ను కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ పర్యటన మరోసారి రుజువు చేసిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బీఆర్ఎస్ హ‌యంలోనే మైనార్టీల అభివృద్ది

తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఏ రూపంలోనూ మేలు చేయలేకపోతున్న ప్రభుత్వానికి చక్కటి ఉదాహరణలు మ‌హ‌బూబ్ న‌గ‌ర్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సొంతంగా రాసిన వ్యాసంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని, తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని వాపోయారని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అయితే మరింత ముందుకెళ్లి ప్రపంచ బ్యాంకుకే లేఖ రాయాల్సిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రుల గురించి కేటీఆర్ మాట్లాడుతూ, “వాళ్లు టూరిస్టులే, ఎన్నికలు అయిపోగానే కనిపించరు” అంటూ ఎద్దేవా చేశారు.

ప్రజల కష్టసుఖాల్లో నిజంగా పాలుపంచుకునే నాయకులు బీఆర్ఎస్‌కు మాత్రమే ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 'ఫ్యూచర్ సిటీ' కడతానంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజెంట్ సిటీలో ప్రస్తుత సమస్యలు పరిష్కరించలేని నాయకుడు, భవిష్యత్ పట్టణాల కలలు ఎందుకు కంటున్నాడని ప్రశ్నించారు. ఇంకా, “ఉన్న మెట్రోను రద్దు చేసి, జనాభా లేని ప్రాంతాల్లో కొత్త మెట్రో వేస్తామనడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనం” అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చివరగా ఫ్యూచర్ సిటీ నిజంగా తయారవుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు కాదు, తెలంగాణ భవిష్యత్ తరాలే దానిని నిర్మించుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇంటింటికీ 'బాకీ కార్డు' పంచిన బీఆర్ఎస్ - Tholi Paluku