
ఇంటింటికీ గ్యాస్.. ఊరూరా పెట్రోల్ బంకులు: ఈ ఏడాది ఇంధన రంగం ప్రగతి ఇదే!
2025వ సంవత్సరంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సామాన్యుడికి ఇంధనం చౌకగా అందజేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్ సరఫరాను మెరుగుపర్చడంతో పాటు, పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన ఇంధనాలను అందుబాటులోకి తెచ్చింది. దేశం ఆర్థికంగా వేగంగా ఎదగడానికి చమురు, గ్యాస్ రంగాలు చాలా ముఖ్యం. అందుకే, ప్రతి ఒక్కరికీ ఇంధనం సులభంగా దొరకాలని, అదే సమయంలో పర్యావరణం పాడవకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కొత్త మార్పులను ప్రవేశపెట్టింది.
ఉజ్వల యోజనతో ఇంటింటికి వంట గ్యాస్
ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 2025 డిసెంబర్ 1 నాటికి సుమారు 10.35 కోట్ల కుటుంబాలకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు అందాయి. ఇంకా అర్హులైన వారికి గ్యాస్ అందించేందుకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో 25 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్యాస్ కనెక్షన్ పొందే ప్రక్రియను సులభతరం చేస్తూ, పాత విధానాన్ని తొలగించి ఒకే డిక్లరేషన్‌తో అర్హత నిర్ధారించే విధానాన్ని అమలు చేసింది.
గ్యాస్ ధర భారం తగ్గింపు
ఉజ్వల లబ్ధిదారులకు 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ, సంవత్సరానికి గరిష్ఠంగా 9 సిలిండర్ల వరకు అందించారు. దీని వల్ల గ్యాస్ వినియోగం పెరిగింది. ఒక్కో కుటుంబం వాడే సిలిండర్ల సంఖ్య 2019–20లో సగటు 3గా ఉండగా, 2024–25లో 4.47కి, 2025–26లో సుమారు 4.85కి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఆధార్ వెరిఫికేషన్, భద్రతా తనిఖీలు
గ్యాస్ సబ్సిడీలు సరైన వారికి చేరేందుకు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను వేగవంతం చేశారు. 2025 చివరి నాటికి ఉజ్వల లబ్ధిదారుల్లో 71 శాతం, ఇతర వినియోగదారుల్లో 62 శాతం మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అదే సమయంలో భద్రతపై కూడా దృష్టి సారిస్తూ దేశవ్యాప్తంగా 12.12 కోట్ల ఉచిత గ్యాస్ భద్రతా తనిఖీలు నిర్వహించారు. 4.65 కోట్ల గ్యాస్ పైపులను సబ్సిడీ ధరకు మార్చారు.
పెట్రోల్ బంకుల్లో సౌకర్యాల పెంపు
దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. దూరప్రాంతాల ప్రజలకు ఇంధనం చేరువ చేసేందుకు 3,200కుపైగా మొబైల్ ఫ్యూయల్ వాహనాలు (బౌజర్లు) ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయగా, చాలా చోట్ల మహిళలు–పురుషులకు వేర్వేరు సౌకర్యాలు ఉన్నాయి.
ట్రక్ డ్రైవర్ల కోసం ‘అప్‌నా ఘర్’
హైవేలపై ట్రక్ డ్రైవర్లకు విశ్రాంతి, భోజనం, స్నానం వంటి సౌకర్యాల కోసం అప్‌నా ఘర్ పథకం కింద 500కు పైగా విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇది రోడ్డు భద్రతను పెంచడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి దోహదపడింది.
ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫేమ్-II పథకం కింద 8,932 EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆయిల్ కంపెనీలు తమ స్వంత నిధులతో మరో 18,500 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, బయో ఇంధనాలు, ఈవీ ఛార్జింగ్-అన్నీ ఒకేచోట అందించేలా ఎనర్జీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 2025 నవంబర్ నాటికి 1,064 ఎనర్జీ స్టేషన్లు పనిచేస్తున్నాయి.
గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణ
దేశంలో సహజ వాయు పైప్‌లైన్ల పొడవు 2014లో 15,340 కి.మీ ఉండగా, 2025 నాటికి 25,429 కి.మీకి పెరిగింది. మరో 10,459 కి.మీ నిర్మాణంలో ఉన్నాయి. “ఒకే దేశం- ఒకే గ్రిడ్- ఒకే టారిఫ్” విధానం ద్వారా గ్యాస్ ధరల్లో ప్రాంతాల మధ్య తేడా తగ్గింది.
సిటీ గ్యాస్, బయోగ్యాస్ విస్తరణ
సిటీ గ్యాస్ పంపిణీ 307 ప్రాంతాలకు విస్తరించింది. 1.57 కోట్ల ఇళ్లకు పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్లు, 8,400కి పైగా సీఎన్‌జీ స్టేషన్లు, ఎస్‌ఏటీఏటీ పథకం కింద 130కి పైగా బయోగ్యాస్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. 2025-26 నుంచి సీఎన్‌జీ, పీఎన్‌జీలో బయోగ్యాస్ మిశ్రమం తప్పనిసరి అయింది.
ఎథనాల్, బయోఫ్యూయల్స్‌తో దిగుమతుల తగ్గింపు
పెట్రోల్‌లో ఎథనాల్ కలయిక 19.24 శాతంకి చేరింది. దీని వల్ల ఇప్పటివరకు రూ.1.55 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్య పొదుపు జరిగింది. కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గాయి.
పనిపట్, నుమాలిగఢ్‌లో రెండో తరం ఎథనాల్ ప్లాంట్లు పనిచేయడం ప్రారంభించాయి.
విమానాల కోసం స్వచ్ఛ ఇంధనం
అంతర్జాతీయ విమానాలకు 2027 నుంచి 1 శాతం, 2028 నుంచి 2 శాతం, 2030 నుంచి 5 శాతం
సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ ఏఎఫ్) వినియోగ లక్ష్యాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఈ రంగంలో ముందడుగు వేసింది.
చమురు అన్వేషణ, భద్రతా నిల్వలు
2025లో చమురు రంగానికి కొత్త చట్టాలు తీసుకొచ్చారు. 172 చమురు, గ్యాస్ బ్లాక్‌లు వేలం వేయగా, సుమారు 4.36 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. వ్యూహాత్మక చమురు నిల్వలను కూడా మరింత బలోపేతం చేశారు.
మొత్తం చూస్తే 2025లో పెట్రోలియం మరియు సహజ వాయు రంగం, గ్యాస్ కనెక్షన్ల విస్తరణ, ఇంధన సౌకర్యాల ఆధునీకరణ, స్వచ్ఛ ఇంధనాల ప్రోత్సాహం, ఇంధన భద్రత అన్నింట్లో ముందడుగు వేసింది. ఇది సామాన్య ప్రజలకు చౌక ఇంధనం, దేశానికి శక్తివంతమైన, సురక్షిత భవిష్యత్తు దిశగా తీసుకెళ్లే కీలక అడుగుగా నిలిచింది.
