Let's talk: editor@tmv.in
ఇంటింటా సంబురాలు తెచ్చే దీపావళి పండుగ వచ్చేస్తుందోచ్…

ఇంటింటా సంబురాలు తెచ్చే దీపావళి పండుగ వచ్చేస్తుందోచ్…

Dantu Vijaya Lakshmi Prasanna
16 అక్టోబర్, 2025

భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పండుగలలో, దీపావళికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఆనందం, ఉత్సాహం మరియు అప్యాయతలను నింపుకునే ఒక మహోత్సవం. జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, యావత్ భారతావని సమైక్యంగా జరుపుకునే పండుగే ఈ దివ్య దీప్తుల దీపావళి. ఇది జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి!

ఈ పండుగ విజయానికి, సంతోషానికి ప్రతీకగా నిలుస్తుంది. పురాణ కథనాల ప్రకారం, ప్రజలను పట్టిపీడించిన నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు, ఆ పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. అలాగే, లంకేశ్వరుడు రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా, ఆ చీకటి రోజులు తొలగిపోయిన ఆనందోత్సవాల మధ్య ప్రజలు దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. ఈ విధంగా, దీపావళి చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా తరతరాలుగా నిలిచింది. ఈ పండుగ సోయగాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం (చిన్నా పెద్దా అందరూ), నూతన వస్త్రాల రెపరెపలు, ఇల్లంతా నిండిపోయే పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు... ఇవన్నీ ఈ దివ్య దీపావళికి మరింత శోభను, ఉల్లాసాన్ని తీసుకొస్తాయి. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి, నూతన వెలుగులను, సంతోషాన్ని తీసుకొచ్చే ఈ గొప్ప పర్వదినాన్ని హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతాల వారు కూడా ఉల్లాసంగా జరుపుకుంటారు. దీపావళిని ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) ఈ పండుగ వేడుకలను అక్టోబర్ 18 నుంచి 23 వరకు జరుపుకోనున్నారు. ముఖ్యంగా, అక్టోబర్ 19న నరక చతుర్దశి, అక్టోబర్ 20న దీపావళి (లక్ష్మీ పూజ) పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం.

ధన త్రయోదశి (ధన్వంతరి జయంతి)

ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

లక్ష్మీ కటాక్షం: ఈ రోజున ఇంటిని శుభ్రం చేసి, పాత సామాన్లను తొలగించి కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలను పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మి, కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి మాత్రమే కాకుండా, ఈ రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందని నమ్ముతారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించినప్పుడు, ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి ఆమె అనుగ్రహం లభిస్తుంది.

ధన్వంతరి ఆవిర్భావం: ఆరోగ్యం, ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి, ఆ మహాభాగ్యానికి అవసరమైన ఔషధాల దాత ధన్వంతరి. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి కూడా ఆవిర్భవించాడు. ఆయన ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి వచ్చాడు. అందుకే అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కోసం ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి శ్రీమన్నారాయణుని అంశ అని, ఆయన్ని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించే ముందు ధన్వంతరిని స్మరించుకుంటారు.

నరకాసుర సంహారం* *(నరక చతుర్దశి)

రామాయణంలోనే కాకుండా, పౌరాణిక కథనం ప్రకారం ద్వాపర యుగంలో జరిగిన ఒక ముఖ్య ఘట్టం దీపావళికి ఆధారం. భూదేవి, వరాహ స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తన తల్లి చేతిలో తప్ప శ్రీహరి చేతిలో చావు లేకుండా వరం పొందుతాడు. ఈ వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు.

నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు,గంధర్వులు శ్రీమహావిష్ణువుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించ గా, భూదేవి సత్య భామగా జన్మిస్తుంది. నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరును కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.

నరకాసుర సంహారంతో దేవతలతో సహా అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకుడు మరణించిన రోజు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

అసలైన దీపావళి

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోஉస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది.

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.."నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను ఐదు రోజుల వేడుకగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమయ్యే దీపావళి వేడుకలు, కార్తీక శుద్ధ విదియ నాటి 'భగినీహస్త భోజనం'తో ముగుస్తాయి.

పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు- ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు పౌరాణికులు. అంతేకాక సత్యం,శివం,సుందరం అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు.

అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ

ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే

అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్ధశి, అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.

దీపావళి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగిస్తారు. ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దరిద్రం, దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.

ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దక్షిణాన ప్రజలు దీపాలతో గృహాలను అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు. కొందరైతే ముత్యపు పిడతలో అటుకులు పోసి దానిపై దీపపు ప్రమిద పెడతారు. తరువాత దాన్ని బాలికలను లక్ష్మీదేవిగా బావించి వారికి వాయినంగా ఇస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.

దీపావళి లక్ష్మీ పూజ (ఆశ్వయుజ అమావాస్య)

ఆశ్వయుజ అమావాస్య రోజునే ముఖ్యమైన దీపావళి పండుగను జరుపుకుంటారు.

దివిటీల కోలాహలం: ఈ రోజు ఇంటిని శుభ్రం చేసి, పువ్వులతో అలంకరించి, రకరకాల పిండివంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల వద్ద నేల మీద కొడుతూ... ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ!’ అని పాటలు పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లి శుభసూచకంగా మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఒక నమ్మకం.దీన్ని కొన్ని ప్రాంతాలవారు దివిటీలుకొట్టడం అంటారు..

లక్ష్మీ పూజ: తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలకు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం శుభప్రదం. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి మొక్క దగ్గర తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఈ రోజు ధనలక్ష్మి పూజ చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని విశ్వాసం. దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం ద్వారా తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్తగా కొనుగోలు చేసిన బంగారు, వెండి ఆభరణాలను పూజలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.పిల్లలు పెద్దలు సంతోషంతో టపాసులు కాలుస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటారు.

భగినీ హస్త భోజనం (యమ ద్వితీయ/భాయిదూజ్)

దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియ రోజున యమ ద్వితీయ లేదా భాయిదూజ్‌గా ముగుస్తాయి.

ఈ రోజున సోదరులు తమ సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం.

యమున కథ: సూర్యభగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున (యమి). యమున తన సోదరుడిని ఎంతగానో అభిమానించేది. నిత్యమూ తన మిత్రులతో గడుపుతూ, క్షణం తీరిక లేకుండా ఉన్న యముడు ఎన్నిసార్లు కోరినా సోదరి ఇంటికి వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియ రోజున తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. అందుకు యముడు, "నన్ను ఎవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక తప్పక వెళ్లి తీరాలి" అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి యమున సంతోషించి, అతనికి అభ్యంగన స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని యమున కోరింది. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు, ప్రేమకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది. ఇలా భక్తినప్రవర్తులతో చేసుకునే దీపావళి సంబురాలు ప్రతి ఇంటా అంబారాన్ని చేరుకుంటాయి..

ఇంటింటా సంబురాలు తెచ్చే దీపావళి పండుగ వచ్చేస్తుందోచ్… - Tholi Paluku