
ఇంటర్నేషనల్ ఐడియా చైర్మన్ గా సీఈసీ జ్ఞానేష్ కుమార్
భారతదేశ ఎన్నికల ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, 37 ప్రజాస్వామ్య దేశాలతో కూడిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ ( ఇంటర్నేషనల్ ఐడియా ) కు అధ్యక్షత వహించడానికి దేశాన్ని మొదటిసారి ఆహ్వానించారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ పరిణామం ప్రాముఖ్యతను చెబుతూ భారతదేశంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడాన్ని ప్రపంచం గుర్తించింది . 30 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా ప్రపంచంలోని 37 ప్రజాస్వామ్య దేశాల సమూహం భారతదేశాన్ని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్, ఇంటర్నేషనల్ ఐడియాకు అధ్యక్షత వహించడానికి ఆహ్వానించింది. ఇది దేశ ప్రజలకు, ఎన్నికల కమిషన్ అధికారులకు ఎంతో గర్వకారణమైన క్షణమని అన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 2026 డిసెంబర్ 3న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో భారత్ తరపున ఇంటర్నేషనల్ ఐడియా ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. 1995లో స్థాపించిన ఇంటర్నేషనల్ ఐడియా ప్రస్తుతం 35 దేశాల సభ్యత్వం కలిగిన అంతర్-ప్రభుత్వ సంస్థ. అమెరికా, జపాన్ పరిశీలక దేశాలుగా ఉన్నాయి. 2003 నుంచి ఐక్యరాజ్యసమితి సర్వసభలో దీనికి పరిశీలక హోదా ఉంది. భారత్ ఈ సంస్థకు స్థాపక సభ్య దేశం కావడం గమనార్హం. గతంలోనూ ఎన్నికల పరిశోధన, సామర్థ్య నిర్మాణం, శిక్షణా కార్యక్రమాల్లో భారత్ చురుకుగా పాల్గొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా 99.1 కోట్లకు పైగా (991 మిలియన్) ఓటర్లతో ఉన్న భారత్… 2026లో ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు తన అపార అనుభవాన్ని పంచుకుని, ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ సంస్థలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటర్నేషనల్ ఐడియాలోని 35 సభ్య దేశాలు + 2 పరిశీలక దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య 222.5 కోట్లు (2,225,549,481).
ప్రజాస్వామ్య శక్తిలో భారత్‌ది మొదటి స్థానమే
ఇందులో మనదేశం వాటా 44.5 శాతం (99.1 కోట్లు) – ఇదే అత్యధికం. భారతదేశం – 991 మిలియన్లు, అమెరికా – 234.5, ఇండోనేషియా – 204.4, బ్రెజిల్ – 155.6, జపాన్ – 103.9 మిలియన్లుగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, కెనడా మొదలైనవి కూడా జాబితాలో ఉన్నాయి. చిన్న దేశాలైన లక్సెంబర్గ్ (2.86 లక్షలు), కేప్ వర్ది, బార్బడోస్ వంటివి కొన్ని వేల ఓటర్లతో ఉన్నాయి. 2026లో ఇంటర్నేషనల్ ఐడియా ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో భారత్ ఈ విధంగా ప్రపంచ ప్రజాస్వామ్య ఎన్నికల వేదికపై తన బృహత్తరమైన స్థానాన్ని మరోసారి నిరూపించుకుంటోంది.
