
ఇంగ్లాండ్ రైల్లో కత్తిపోట్ల కలకలం.. 10 మందికి గాయాలు, ఇద్దరి అరెస్ట్
ఇంగ్లాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. శనివారం రాత్రి సమయంలో ఒక రైలులో దుండగుడు కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ దాడిలో మొత్తం పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఘటన వివరాలు
ఈ దాడి స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:25 గంటలకు డోన్‌కాస్టర్ నుంచి లండన్ కింగ్స్ క్రాస్ వైపు వెళ్తున్న ఎల్‌ఎన్‌ఈఆర్ (లండన్ నార్త్ ఈస్టర్న్ రైల్వే) సర్వీస్ రైలులో జరిగింది. ఈ రైలు కేంబ్రిడ్జ్‌షైర్‌లోని పీటర్‌బరో స్టేషన్ దాటిన కొద్దిసేపటికే దాడులు మొదలైనట్లు తెలుస్తోంది.
దాడి గురించి సమాచారం అందిన వెంటనే, రైలును హంటింగ్‌డన్ స్టేషన్ వద్ద ఆపారు. బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ అధికారులు, స్థానిక కేంబ్రిడ్జ్‌షైర్ పోలీసులు, సాయుధ దళాలు వెంటనే స్టేషన్‌కు చేరుకుని రైలును చుట్టుముట్టాయి. సాయుధ బలగాలు లోపలికి వెళ్లి పరిస్థితిని నియంత్రించి, దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారందరినీ అంబులెన్సులు, ఎయిర్ అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ ఈ ఘటనను 'మేజర్ ఇన్సిడెంట్'గా ప్రకటించింది. దాడికి గల పరిస్థితులు, ఉద్దేశాలను తెలుసుకునేందుకు దర్యాప్తులో ఉగ్రవాద నిరోధక దళాలు మద్దతు ఇస్తున్నాయని పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ దాడికి ఉగ్రవాద ప్రేరేపిత అంశాలు ఉన్నాయని ధృవీకరించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు.
ప్రధాని స్పందన
ఈ భయంకరమైన ఘటనపై యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "హంటింగ్‌డన్ సమీపంలో రైలులో జరిగిన ఈ భయంకరమైన ఘటన చాలా ఆందోళన కలిగించే విషయం. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. తక్షణమే స్పందించిన అత్యవసర సేవల సిబ్బందికి ధన్యవాదాలు" అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.
హంటింగ్‌డన్‌లో జరిగిన కత్తిపోట్ల గురించి విని "ఎంతో బాధపడ్డాను" అని హోం కార్యదర్శి షబానా మహమూద్ తెలిపారు. "ఇద్దరు అనుమానితులను తక్షణమే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. నేను దర్యాప్తుపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నాను. ఈ దశలో ప్రజలు ఊహాగానాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని నేను కోరుతున్నాను" అని ఆమె అన్నారు.
షాడో హోం కార్యదర్శి క్రిస్ ఫిల్ప్ ఈ దాడి "క్రూరమైన సామూహిక దాడి"గా కనిపిస్తోందని అభివర్ణించారు. గాయపడిన వారిపై దృష్టి సారించాలని, వీలైనంత త్వరగా అరెస్టు చేసిన వారి వివరాలు, ఘటనపై అప్‌డేట్ ఇవ్వాలని ప్రభుత్వం, పోలీసులకు సూచించారు.
ఈ ఘటన కారణంగా ఈస్ట్ కోస్ట్ మెయిన్‌లైన్‌లో రైలు సర్వీసులు భారీగా అంతరాయం కలిగింది. ఆదివారం కూడా ప్రయాణాలు చేయవద్దని లండన్ నార్త్ ఈస్టర్న్ రైల్వే ప్రయాణికులను కోరింది. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరెస్టు చేసిన వ్యక్తుల వివరాలు, దాడికి గల కారణాల గురించి మరింత సమాచారం వెల్లడించాల్సి ఉంది.
యూకేలో కత్తి నేరాలు
యూకేలో 2011 నుండి కత్తి నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కీర్ స్టార్మర్ దీనిని "జాతీయ సంక్షోభం"గా అభివర్ణించారు. గతేడాది ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యల్లో భాగంగా దాదాపు అరవై వేల కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కత్తిని తీసుకెళ్లడం నేరం. దీనికి గరిష్టంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
