
ఇంకా మానని పుల్వామా దాడి గాయాలు
2019లో పుల్వమాలో జరిగిన ఉగ్రదాడికి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా, ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబ సభ్యులు తమ ప్రియమైన వారిని స్మరించుకున్నారు. అయితే, కొన్ని కుటుంబాలు తమ అమరుల పేరుతో హామీ ఇచ్చిన గౌరవాలు ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
సీఆర్పీఎఫ్ జవాన్ జైమల్ సింగ్ భార్య సుఖ్‌జిత్ కౌర్ మాట్లాడుతూ, తన భర్త పేరుతో నిర్మించాల్సిన స్టేడియం ఇంకా నిర్మించలేదని చెప్పారు. గలౌటి రోడ్డుపై ఆయన స్మారకంగా నిర్మించాల్సిన గేటు కూడా ఇంకా పూర్తికాలేదని తెలిపారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో గలౌటి గ్రామానికి చెందిన జైమల్ సింగ్, 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో దాడి చేసిన సీఆర్పీఎఫ్ బస్సును నడుపుతున్నారు. ఆయన లేకుండా జీవితం ఎంత కష్టమో మాకు మాత్రమే తెలుసని సుఖ్‌జిత్ కౌర్ భావోద్వేగంగా చెప్పారు. తన కుమారుడు ఐదున్నరేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడని, ఇప్పుడు 12 ఏళ్ల వయసులో తరచూ తండ్రిని గుర్తు చేసుకుంటాడని తెలిపారు. జరిగింది మారదని అతనికి ఇప్పుడు అర్థమవుతోందని అన్నారు.
తరన్ తారన్ జిల్లాలోని గాందీవింద్ గ్రామంలో అమరుడు సుఖ్జిందర్ సింగ్ కుటుంబ సభ్యులు ఆయన త్యాగాన్ని స్మరించుకున్నారు. సుఖ్జిందర్ సోదరుడు గుర్జంత్ సింగ్, ఆయన పేరుతో ఉన్న ప్రభుత్వ పాఠశాలను 12వ తరగతి వరకు అభివృద్ధి చేయాలని, అలాగే నిర్మాణంలో ఉన్న స్టేడియాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
దేశం శనివారం పుల్వామా దాడి దినాన్ని గుర్తుచేసుకుంది. ఆ దాడిలో జైషే మహ్మద్ (జెఈఎం)కు చెందిన ఆత్మాహుతి సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన కారును సీఆర్పీఎఫ్ బస్సుకు ఢీకొట్టడంతో 40 మంది సిబ్బంది వీరమరణం పొందారు. బ్లాక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, మమతా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమరులను స్మరించుకుని, నివాళులు అర్పించారు.
