Let's talk: editor@tmv.in
ఇంకా పిఠంపూర్‌లోనే భోపాల్ విషబూడిద

ఇంకా పిఠంపూర్‌లోనే భోపాల్ విషబూడిద

Pinjari Chand
3 డిసెంబర్, 2025

భోపాల్ గ్యాస్ దురంతంతో సంబంధం ఉన్న యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీకి చెందిన విషపూరిత వ్యర్థాలు, కలుషితమైన మట్టి, ప్యాకేజింగ్ మెటీరియల్‌ను మధ్యప్రదేశ్‌లోని పిఠంపూర్‌లోని ఒక ప్లాంట్‌లో దహనం చేసి ఐదు నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియలో ఏర్పడిన సుమారు 900 టన్నుల బూడిదను పారవేయలేదు. మొత్తం 358 టన్నుల పదార్థం అందులో 337 టన్నుల విష వ్యర్థాలు, 19 టన్నుల కలుషిత మట్టి, 2.2 టన్నుల ప్యాకేజింగ్ మెటీరియల్ ను ఈ ఏడాది జులై మొదటి వారంలో పూర్తిగా దహనం చేశారు. ఈ వ్యర్థాలను ఈ ఏడాది జనవరి 2న భోపాల్ నుంచి పిఠంపూర్‌కు తరలించి, ఆరు నెలల తర్వాత దహన ప్రక్రియ నిర్వహించారు. శాస్త్రీయ పద్ధతిలో సున్నం, ఇతర పదార్థాలు కలిపి ఇన్‌సినరేటర్‌లో దహనం చేయడంతో దాదాపు 900 టన్నుల బూడిద ఏర్పడిందని అధికారులు తెలిపారు.

ల్యాండ్‌ఫిల్ సెల్‌ లో పూడ్చోద్దు

ప్రభుత్వం మొదట పిఠంపూర్ ప్లాంట్ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న ల్యాండ్‌ఫిల్ సెల్‌(విషాన్ని భూమి లోపల అతి జాగ్రత్తగా పాతిపెట్టే, ఎప్పుడూ బయటకు రాకుండా రూపొందించిన ఒక రకమైన సీల్డ్ సమాధి) లో ఈ బూడిదను పూడ్చివేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్లాంట్ ధార్ జిల్లాలోని తర్పురా గ్రామం సమీపంలో ఉంది. ఆ గ్రామ జనాభా దాదాపు 20 వేలు. కానీ రెండు నెలల క్రితం మధ్యప్రదేశ్ హైకోర్టు మానవ నివాస ప్రాంతాలకు సమీపంలో బూడిదను పూడ్చివేయడం ‘అంగీకారయోగ్యం కాదు’ అంటూ ప్రత్యామ్నాయ స్థలం వెతకాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బూడిద ప్రస్తుతం ప్లాంట్‌లోని లీక్-ప్రూఫ్ స్టోరేజ్ షెడ్‌లో సురక్షితంగా నిల్వ ఉంది.1984 డిసెంబర్ 2-3 తేదీల్లో తెల్లవారుజామున యూనియన్ కార్బైడ్ పురుగుమందు ఫ్యాక్టరీ నుంచి అత్యంత విషరసాయన మిథైల్ ఐసోనేట్ గ్యాస్ లీక్ కావడంతో కనీసం 5,479 మంది మరణించగా, వేలాది మంది శాశ్వతంగా వికలాంగులయ్యారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా నమోదైంది.

మెర్య్కురీ పరిమితి ఎక్కువగా ఉంది

ఈ ఏడాది అక్టోబర్ 8న జబల్‌పూర్ బెంచ్ ఆదేశాల్లో పిఠంపూర్ ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న ల్యాండ్‌ఫిల్ సెల్‌లో బూడిద పూడ్చివేయడం సరికాదంది. మానవ నివాస ప్రాంతాలకు సమీపంలో విష బూడిద నిల్వ అంగీకారయోగ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒక ఇంటర్వీనర్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను ఉటంకిస్తూ బూడిదలో పాదరసం (మెర్క్యురీ) స్థాయి అనుమతించదగిన పరిమితి కంటే ఎక్కువగా ఉందని, ఆగస్టు 12, 2025ని మధ్యప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదికలోనూ ఇదే విషయం పేర్కొనబడిందని కోర్టు పేర్కొంది.

ప్రత్యామ్నాయ స్థలాలను సూచిస్తూ నివేదిక సమర్పించాలని, అలాగే ఇలాంటి విష రసాయన వ్యర్థాల నిర్వహణలో అంతర్జాతీయ నైపుణ్యం ఉన్న సంస్థల నుంచి గ్లోబల్ టెండర్ ను ఆహ్వానించారా? లేదా అనే విషయాన్ని కూడా తెలపాలని కోర్టు ఆదేశించింది.

ఈ విషయం కోర్టులో ఉన్నందున అధికారులు డిస్పోజల్ ప్రణాళికపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు. అయితే పేరు తెలపని ఒక అధికారి మాత్రం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం ప్లాంట్ పరిసరాల్లోనే డెడికేటెడ్ ల్యాండ్‌ఫిల్ సెల్‌లో బూడిదను పూడ్చివేస్తామని, భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నామని, ఆ సెల్ నిర్మాణం అంతిమ దశలో ఉందని చెప్పారు.

ఇండోర్ నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్న పిఠంపూర్ రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ సుమారు 1,250 పారిశ్రామిక యూనిట్లు ఉండగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులతో సహా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.

పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది

స్థానిక సామాజిక కార్యకర్తలు మానవ నివాస ప్రాంతాలకు దగ్గరలో బూడిదను పూడ్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘పిఠంపూర్ బచావో సమితి’ అధ్యక్షుడు హేమంత్ కుమార్ హిరోలే మాట్లాడుతూ విష బూడిదను జనావాసాలకు దూరంగా ఉన్న నిర్జన ప్రాంతంలో పారవేయాలి. ల్యాండ్‌ఫిల్ సెల్‌లో ఏదైనా లోపం ఏర్పడితే పరిసర ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

గత నాలుగు దశాబ్దాలుగా భారత్‌లోనూ, విదేశాల్లోనూ వ్యర్థాలను పారవేయడానికి అనేక ప్రణాళికలు రూపొందాయి కానీ నిరసనలతో రద్దయ్యాయి. చివరకు ఈ ఏడాది పిఠంపూర్‌లోని ప్రైవేట్ వ్యర్థ నిర్వహణ ప్లాంట్‌లో దహనం చేసి బూడిదగా మార్చారు. దహన సమయంలో పార్టిక్యులేట్ మ్యాటర్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మెర్క్యురీ, కాడ్మియం వంటి ఉద్గారాలు అన్నీ ప్రమాణాల్లోనే ఉన్నాయని, ప్లాంట్ కార్మికులకు లేదా పరిసర ప్రజలకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు రాలేదని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ధృవీకరించారు. ఈ విష వ్యర్థాలు ఈ ఏడాది జనవరి 2న భోపాల్ నుంచి 250 కి.మీ. దూరంలో ఉన్న పిఠంపూర్‌కు తరలించగా, ఆ సమయంలోనూ పిఠంపూర్‌లో తీవ్ర నిరసనలు జరిగాయి. ఈ ప్రక్రియ పర్యావరణం, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనే ఆందోళన వ్యక్తమైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆందోళనలను కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈ అంశంపై ఐదు పిటిషన్లు హైకోర్టులో ఏకకాలంలో విచారణలో ఉన్నాయి.