
ఇంకా అమెరికా కలల భావ దారిద్ర్యం - సత్యాన్ని గుర్తించలేక పోతున్న భారతీయ మధ్య తరగతి
డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ‘గోల్డ్ వీసా కార్డ్’ వార్త భారతీయ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఇది దేశంలోని మధ్యతరగతి మనసుల్లో ఇంకా అమెరికా కల ఎంత బలంగా ఉందో మళ్లీ గుర్తు చేసింది. దశాబ్దాలుగా అమెరికాలో చదవడం, ఉద్యోగం చేయడం, అక్కడే స్థిరపడిపోవడం అనే మూడు పదాలు కుటుంబాల్లో గర్వకారణంగా నిలిచాయి. ‘అమెరికాలో సెటిల్ అయిపోయాడు’ అనే మాట ఇప్పటికీ చాలామందికి విజయానికి ఒక ముద్రలా అనిపిస్తుంది.
కానీ నేటి ప్రపంచం మునుపటి లాగా ఏకధృవ ప్రపంచం కాదు. అమెరికా ఆధిపత్యం తగ్గుతూ, ఆసియా – ముఖ్యంగా భారత్,చైనాలు – ఎదుగుతున్నాయి. ప్రపంచం బహుళ ధ్రువ నిర్మాణానికి వెళ్లుతోంది. ఈ కొత్త వాస్తవం గుర్తించకుండా ఇంకా చాలా మంది భారతీయులు పాత యోచనలకే బానిసలై ఉండటం మన భావ దారిద్ర్యంగా కనిపిస్తుంది.
భారతీయుల అమెరికా పట్ల ఆకర్షణకు చరిత్రలోని ఆర్థిక కష్టాలు ఒక పెద్ద కారణం. విదేశాలకు వెళ్లి విజయవంతమైన భారతీయుల కథలు, ఇక్కడి పాత పేద ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే అక్కడి సదుపాయాలు, పరిశుభ్రమైన వ్యవస్థలు, జీతాల స్థాయి ఇవి ఒక తరం మనస్తత్వంలో లోతైన ముద్ర వేసాయి. ఆ ముద్ర తరతరాలకూ తరలిపోయింది. సోషల్ మీడియాలో అమెరికాలోని మెరిసే జీవిత చిత్రణ ఈ కలను మరింత గొప్పగా చూపిస్తున్నాయి.
అయినప్పటికీ, నేటి ప్రపంచ వాస్తవం పూర్తిగా మారిపోయింది. అమెరికా ఇక ఒంటరిగా ప్రపంచాన్ని నడిపే శక్తి కాదు. చైనా ఎదిగింది. మధ్యప్రాచ్యం వ్యాపార కేంద్రాలుగా మారుతోంది. యూరప్ ఆర్థిక మందగమన సమస్యలతో పోరాడుతోంది. ముఖ్యంగా భారత్ వేగంగా ఎదుగుతూ, ఆర్థిక వృద్ధి, సాంకేతిక సామర్థ్యం, అంతర్జాతీయ రాజకీయాలలో ప్రభావం, ఇలా అన్ని రంగాల్లో ఒక ప్రధాన ధృవంగా మారుతోంది. ఒకప్పుడు భారతీయ యువకుడు ఎదురుచూసే అవకాశాలు ఇవాళ భారత్‌లోనే వేగంగా విస్తరిస్తున్నాయి.
ఈ మార్పును ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాలు ఇంకా గమనించలేదు. అమెరికా కాన్సులేట్ల ముందు నిలిచే భారీ క్యూలను వారు గొప్ప అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు భావిస్తారు. పాశ్చాత్య దేశాల ఆమోదం ఇంకా ఒక సామాజిక ప్రతిష్టలా భావిస్తున్నారు. కానీ అదే సమయంలో భారత్‌లో జరిగే ఆర్థిక విప్లవం, డిజిటల్ ఇండియా పరివర్తన, స్టార్ట్‌అప్‌లు, ఉద్యోగాలు, మౌలిక వసతులు ఇవన్నీ వారికి నెమ్మదిగా కనిపిస్తున్నాయి.
అమెరికాలో జీవితం కూడా మునుపటి లాగా సులభ మార్గం కాదు. H-1B అనిశ్చితి, పెరుగుతున్న ఖర్చులు, ఆరోగ్యభీమా భారాలు, విద్యా రుణాలు, రాజకీయ వాతావరణంలో మార్పులు ఇవి అన్నీ కొత్త వలసదారులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ట్రంప్ గోల్డ్ వీసా కార్డ్ అనే ఆలోచనే అమెరికా ఇప్పుడు మరింత ఎంపికతో, మరింత లెక్కచేసే విధానంతో నడుస్తున్నదనే సంకేతం.
మరోవైపు భారత్‌లో అవకాశాలు ఎన్నడూ లేనంత వేగంతో విస్తరిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్‌లో ప్రపంచానికి మార్గదర్శి దేశం అయ్యాం. స్టార్ట్‌అప్‌లు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పరిశ్రమలు కొత్త పెట్టుబడులతో వేగంగా ఎదుగుతున్నాయి. మంచి హైవేలు, మేట్రోలు, లాజిస్టిక్స్ కారిడార్లు ఇవన్నీ భారత్‌ను ప్రపంచంతో మరింత బలంగా కలుపుతున్నాయి. భారతీయులకు స్వదేశంలో ఎదగడానికి, నాయకత్వాన్ని చేపట్టడానికి, నిర్ణయాత్మక స్థానాల్లో ఉండడానికి అవకాశాలు అపూర్వంగా పెరిగాయి.
‘స్థానికుడిగా ఉండటం’ అనే ఒక పెద్ద ప్రయోజనం కూడా చాలామంది మర్చిపోతున్నారు. భాష, సంస్కృతి, సామాజిక బంధాలు ఇవన్నీ మన సొంత నేలపై మన జీవితాన్ని మరింత బలంగా నిలబెడతాయి. ఒకరు ఎక్కడికైనా చేరినా, చివరికి ఆశ్రయం అనేది తమ మూలాల్లోనే ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో గుర్తింపు, ఒంటరితనం, సాంస్కృతిక దూరం ఇవి అన్ని సంవత్సరాలు గడిచేకొద్దీ భారంగా మారుతాయి.
ఇది విదేశాలకు వెళ్లకూడదన్న వాదన కాదు. ప్రపంచ అనుభవం విలువైనదే. విద్య, పరిశోధన, వృత్తి ఇవన్నీ భారతీయుడు విదేశాల్లో నేర్చుకునే గొప్ప అవకాశాలు. కానీ ‘స్థిరపడిపోవడం’ అనే భావనను గొప్ప విజయ సూచికగా భావించే పాత మనస్తత్వం మారాల్సిన సమయం వచ్చేసింది.
భారత్ ఇవాళ ప్రపంచ వేదికపై తన స్థానం మార్చుకుంటోంది. అవకాశాలు ఇక్కడే ఉన్నాయి. ప్రపంచం బహుళ ధ్రువ నిర్మాణంలోకి వెళ్తున్నప్పుడు, భారతీయుల భవిష్యత్తు కూడా తమ దేశానికే మరింత దగ్గరగా ఉంది.
అమెరికా కల ఇంకా ఆహ్లాదకరంగానే కనిపించవచ్చు. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా వుంది. పాశ్చాత్య ప్రపంచం భారతీయులను మునుపటి లాగా స్వాగతించడం లేదు.
భారతీయులు తమ ఆశయాలను తిరిగి నిర్వచించాల్సిన సమయం వచ్చింది. భారతదేశంలోనే గొప్ప భవిష్యత్తు నిర్మించవచ్చు. తమ నేలపై, తమ భాషలో, తమ ప్రజలతో కలిసి ఎదగడమే నిజమైన దీర్ఘకాల ప్రయోజనం.
